రేపటి నుంచి కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు

Apr 12 2025 2:07 AM | Updated on Apr 12 2025 2:07 AM

రేపటి

రేపటి నుంచి కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు

రొళ్ల: మండలంలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న (ఆదివారం) సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రత్నగిరి సంస్థాన రాజవంశీకుడు దొర రంగప్పరాజు శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఆదివారం సాయంత్రం అమ్మవారి మూల విగ్రహంతో పాటు ఉత్సవ విగ్రహానికి అంకురార్పణ, కుంకుమార్చన, అభిషేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదపండితుల సమక్షంలో గణపతి పూజ చేసి కలశ స్థాపనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయన్నారు. అదే రోజు రాత్రి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పురవీధుల గుండా ఊరేగించి మధ్య రాత్రి అక్కడి నుంచి సమీపంలోని పాలబావి వద్దకు మేళతాళాలతో తీసుకెళ్లి గంగాజలంతో శుద్ధి చేసి పట్టువస్త్రాలు, గాజులు, వడి బియ్యం సమర్పించి, పూలు, పండ్లు నివేదించిన అనంతరం హారతి ఇచ్చి నైవేధ్యంగా బావిలోకి సమర్పిస్తామన్నారు. 13న జలధి ఉత్సవం, కలశస్థాపన, 14న బ్రహ్మరథోత్సవం, ధూళోత్సవం, 15న జలధి, కలశ ఉత్సవం, గంగపూజ, 16 నుంచి 19వ తేదీ వరకు జ్యోతుల ఉత్సవాలు, 20న అమ్మవారికి పుష్పాలంకారణ, పోతులరాజుల విశేష పూజ, 21న పోతులరాజు బండారు కార్యక్రమాలు ఉంటాయన్నారు.

ఒకే ఇంట్లో

రెండు గిన్నిస్‌ రికార్డులు

ధర్మవరం: స్థానిక రాజేంద్రనగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు సోమిశెట్టి రమేష్‌బాబు, శ్యామల కుమార్తెలు కావ్య, ప్రణతి లక్ష్మికు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కింది. జాతీయ సాంస్కృతిక శాఖ, కేంద్ర సంగీత నాటక అకాడమి సంయుక్తంగా ఈ ఏడాది జనవరి 24న న్యూఢిల్లీలో నిర్వహించిన విభిన్న రాష్ట్రాల్లోని 53 జానపద కళారూపాల ప్రదర్శనలో 5,194 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్‌ తరపున వీరిద్దరూ ప్రదర్శించిన జానపద నృత్యాన్ని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో నమోదు చేశారు. దీంతో వీరి పేర్లతో నమోదైన సర్టిఫికెట్లు శుక్రవారం అందడంతో అక్కాచెల్లెలు సంతోషం వ్యక్తం చేశారు.

కంది పంట రాబడిని

అపహరించిన సైబర్‌ నేరగాళ్లు

బెళుగుప్ప: ఆరుగాలం శ్రమించి సాధించిన కంది పంట రాబడిని సైబర్‌ నేరగాళ్లు అపహరించారు. వివరాలు. బెళుగుప్పకు చెంది మహిళా రైతు నిర్మలమ్మ తనకున్న పొలంలో కంది పంట సాగు చేశారు. ఈ క్రమంలో పంట చేతికి రాగా, మార్కెట్‌లో విక్రయించగా వచ్చిన రూ.1.34 లక్షలను స్థానిక ఎస్‌బీఐ శాఖలోని తన ఖాతాలో జమ చేశారు. ఈ నెల 9న అర్థరాత్రి వరుసగా మూడు మెసేజ్‌లు రావడంతో ఆమె పరిశీలించారు. రూ.24,500, రూ.24,960, రూ.50వేలు చొప్పున మొత్తం రూ.99,460 నగదు విత్‌డ్రా అయినట్లుగా తెలుసుకున్న ఆమె కంగుతిని, మరుసటి రోజు ఉదయమే బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీశారు. ఖాతాలో లావాదేవీలను పరిశీలించిన బ్యాంక్‌ అధికారులు... న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లోని ఓ ఖాతాకు బదిలీ అయినట్లు తెలిపారు. ఇది సైబర్‌ నేరగాళ్ల పనిగా నిర్ధారించడంతో శుక్రవారం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు.

వ్యక్తి మృతదేహం లభ్యం

నల్లచెరువు: మండలంలోని నడింపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. గ్రామ శివారులోని పాడుపడిన బావిలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికి తీయించారు. దాదాపు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

బెల్లపు ఊట ధ్వంసం

వజ్రకరూరు: మండలంలోని బోడిసానిపల్లి తండాలో 150 లీటర్ల బెల్లపు ఊటను శుక్రవారం ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ శివసాగర్‌ తెలిపారు. గోపాల్‌నాయక్‌, శంకర్‌నాయక్‌పై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

13న రెడ్డి వివాహ పరిచయ వేదిక

రాప్తాడురూరల్‌: రాయలసీమ రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో ఈనెల 13న ఉచితంగా రెడ్డి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం వ్యవస్థాపకుడు రొద్దం సురేష్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి, కార్యదర్శి దుబ్బా కిషోర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం రూరల్‌ పాపంపేటలోని సంఘం కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరిచయ వేదిక జరుగుతుందని పేర్కొన్నారు. పిల్లలకు వివాహాలు చేయాలనుకునే రెడ్డి కులస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతీ, యువకుల బయోడేటాలు తీసుకురావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94415 75641, 93902 84296, 94907 67224 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

రేపటి నుంచి కొల్హాపురి  మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు 1
1/1

రేపటి నుంచి కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement