పల్లె అనుచరులతో ప్రాణహాని
పుట్టపర్తి టౌన్: మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓ దినపత్రిక పాత్రికేయుడు ఉద్దండం చంద్రశేఖర్ పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. పల్లెకు వ్యతిరేకంగా వార్తలు రాస్తావా అంటూ ఆయన అనుచరుడు, టీడీపీ నల్లమాడ మండల నాయకుడు సలామ్ తనపై దాడులు చేస్తామని, ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ పంపిన వీడియోను పరిశీలించి, తనకు రక్షణ కల్పించాలని కోరారు. నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆగడాల గురించి పత్రికలో ప్రచురిస్తున్నందుకు తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. వార్తలు రాయడం ఆపకపోతే నియోజకవర్గంలో తిరగకుండా చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పీఆర్‌ఓ సంతోష్‌రెడ్డి నుంచి కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా బెదిరింపు మెసేజీలు వచ్చాయని పేర్కొన్నారు. ఉద్దండం వెంట వచ్చిన వారిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి బాబు, సాక్షి స్టాఫర్ రాజేష్, జర్నలిస్టులు మురళి, రమణ, సోముశేఖర్ తదితరులు ఉన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన పాత్రికేయుడు


