భారీ పేలుళ్లతో బెంబేలు
పుట్టపర్తి రూరల్: భారీ పేలుళ్లతో జిల్లా కేంద్రంలో మంగళవారం భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాలు.. ఎనుములపల్లి, బ్రాహ్మణపల్లి, బీడుపల్లి గ్రామాల మీదుగా 342వ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న కొండలను చదును చేసే క్రమంలో కాంట్రాక్టరు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. మంగళవారం చేపట్టిన పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న సత్యసాయి సూపర్ ఆస్పత్రి, సత్యసాయి ఎయిర్‌పోర్టు కార్యాలయం, జిల్లా కేంద్రంలోని అన్ని కార్యాలయాలతో పాటు వేలాది గృహ సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలు కంపించాయి. ఆ సమయంలో భూకంపం వచ్చిందనే భయం అందరిలోనూ వ్యక్తమైంది. ఎనుములపల్లిలో శిల్పారామం, బీడుపల్లి, బ్రాహ్మణపల్లిలో గృహ సముదాయాల గోడలు బీటలు వారాయి. మోతాదుకు మించి మందు గుండు సామగ్రి వినియోగించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పుట్టపర్తి ప్రశాంతతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. జాతీయ రహదారి నిర్మాణం ఎంత అవసరమో... అంతకు మంచి ప్రజల భద్రత కూడా అవసరమని గుర్తించాలని కోరారు.
గుండె ఆగినంత పనైంది
ఒక్కసారిగా భూమి కంపించడంతో గుండె ఆగినంత పనైంది. వృద్ధులు, గుండె జబ్బు బాధితులు ఇంతటి శబ్ద కాలుష్యాన్ని ఎలా భరిస్తారు. ఒక్కసారి పేలుడు సంభవిస్తే ఆకాశమంత ఎత్తుకు ధూళి ఎగిసి పడుతోంది. జాతీయ రహదారి అవసరమే... అయితే నిర్మాణంలో ఇలాంటి పేలుళ్లతో భయానక వాతావరణం సృష్టించడం సరికాదు. – జగన్నాథ, ఎనుములపల్లి
పరుగులు తీశాం
మంగళవారం ఉదయం అందరూ ఇంట్లోనే ఉన్నాం. ఆ సమయంలో ఇల్లు ఒక్కసారిగా కంపించింది. భూకంపం వచ్చిందనుకుని అందరమూ బయటకు పరుగు తీశాం. హైవే పనుల కోసం కొండలు పేల్చడంతో భూమి కంపించినట్లుగా తెలిసింది. పుట్టపర్తి ప్రశాంతతకు భంగం కలిగించేలా చేపట్టిన పేలుళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – చంద్రశేఖర్, బ్రాహ్మణపల్లి
పుట్టపర్తిలో భయాందోళనకు
గురైన ప్రజలు
భారీ పేలుళ్లతో బెంబేలు
భారీ పేలుళ్లతో బెంబేలు


