9, 10 తరగతుల సిలబస్ తగ్గించాలి
పుట్టపర్తి అర్బన్: తొమ్మిది, పదో తరగతుల సిలబస్‌ను తగ్గించాలంటూ డీఈఓ కృష్ణప్పకు జిల్లా ఆంగ్ల ఉపాధ్యాయుల ఫోరం తరపున నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 9, 10వ తరగతుల్లో ఒక్కో తరగతిలో 9 యూనిట్లు, అదనంగా సప్లిమెంటరీ, వర్క్ బుక్‌లు ఉన్నాయని, అధిక సిలబస్ కారణంగా పాఠ్యాంశాల బోధనకు ఉపాధ్యాయులు, అభ్యసనకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠ్యాంఽశాల్లోని అన్ని విషయాలను పూర్తి స్థాయిలో బోధించడానికి సమయం సరిపోవడం లేదన్నారు. ఒక్కో తరగతిలో 6 యూనిట్లు ఉండేలా సిలబస్ సవరించాలని కోరారు. కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, నాగభూషణ, రవిచంద్రారెడ్డి, వెంకట్రాముడు, రేష్మాభాను, రామమూర్తి, బాబు, ఎల్‌వీ రమణ, వాసు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
మార్చురీ అటెండర్ ఆత్మహత్యాయత్నం
● మెడికల్ ఆఫీసర్ వేధింపులే కారణం?
గోరంట్ల: మెడికల్ ఆఫీసర్ వేధింపులు తాళలేక మార్చురీ అటెండర్ ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు... గోరంట్లలోని సామాజిక ఆరోగ్య కేంద్రం మార్చురీలో ఔట్ సోర్సింగ్ విధానంలో అటెండర్‌గా వివాహిత రాధ పనిచేస్తున్నారు. మార్చురీ విభాగానికి సంబంధించిన పరికరాలు, సిబ్బంది సరిగా లేకపోవడంతో అటెండర్ రాధను నర్సింగ్ అటెండర్‌గా పనిచేయాలని మెడికల్ అపీసర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. ఈ క్రమంలో పనితీరుపై వైద్యాధికారి, రాధ మధ్య తరచూ గొడవ పడేవారు. దీంతో రాధ సెలవులో వెళ్లింది. సోమవారం సెలవులు పూర్తి కావడంతో ఆమె విధులకు హాజరయ్యారు. దీంతో ఆమెను నైట్ డ్యూటీకి వేశారు. తనకు చిన్న వయసున్న కుమారుడు ఉన్నాడని, నైట్‌డ్యూటీ వద్దని డాక్టరును రాధ ప్రాధేయపడింది. అయినా డాక్టర్ స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె మంగళశారం ఆస్పత్రిలోని మందులు మోతాదుకు మించి మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకు ముందు ఇదే అంశంపై డీఎంహెచ్‌ఓకు ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై డీసీఎచ్‌ఎస్ తిపేంద్రనాయక్ మంగళవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. మరో వైపు తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి రాధ ఆత్మహత్యాయత్నం చేసిందంటూ పోలీసులకు డాక్టర్ వినోద్ కుమార్ ఫిర్యాదు చేశారు.
వ్యక్తి దుర్మరణం
గోరంట్ల: కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పెనుకొండ మండలం గోనిపెంటకు చెందిన దూబేనాయక్ (50) గోరంట్ల మండలం మిషన్ తండాలోని బంధువులను పలకరించేందుకు మంగళవారం రాత్రి బస్సులో వచ్చాడు. మిషన్ తండా వద్ద బస్సు దిగి జాతీయ రహదారి దాటుతుండగా బెంగళూరు వైపు నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో దూబేనాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
ధర్మవరం అర్బన్: స్థానిక గుట్టకిందపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థిని కనిపించడం లేదు. ఈ మేరకు ధర్మవరంలో రెండో పట్టణ పీఎస్ సీఐ రెడ్డప్ప మంగళవారం వెల్లడించారు. గుట్టకిందపల్లికి చెందిన విద్యార్థిని అనంతపురంలోని ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివింది. ఇటీవల పరీక్షలు రాసిన అనంతరం ఇంటికి చేరుకున్న ఆమె మంగళవారం మధ్యాహ్నం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


