గ్రూప్–2 అభ్యర్థులకు ‘పరీక్ష’!
● మెయిన్స్ పరీక్ష నిర్వహణపై రాత్రి వరకు హైడ్రామా ● ఏపీపీఎస్సీ స్పష్టత ఇవ్వడంతో గందరగోళానికి తెర ● నేడు 15 కేంద్రాల్లో హాజరుకానున్న 5535 మంది అభ్యర్థులు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఒకప్పుడు రాష్ట్రప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ పరీక్షలు, ప్రవేశపరీక్షలు ఎంతో పకడ్బందీగా, పక్కా ప్రణాళిక ప్రకారం, ఎలాంటి డైలమా లేకుండా జరిగేవి. గత ఐదేళ్లూ సాఫీగా సాగాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పరీక్షలు, నోటిఫికేషన్లు ఒకింత గందరగోళాన్ని సృష్టించి అభ్యర్థుల్లో టెన్షన్, ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. తాజాగా గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష నిర్వహణలో అదే గందరగోళం నెలకొంది. శనివారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు పరీక్ష ఉంటుందో లేదో తెలియక అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. ఎట్టకేలకు రాత్రి 8.15 గంటల సమయంలో పరీక్ష యథావిధిగా జరుగుతుందని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో గందరగోళానికి తెరపడింది.
సర్కారు హైడ్రామా..
ఏపీపీఎస్సీ ఇప్పటికే గ్రూప్–2 ప్రిలిమ్స్ నిర్వహించింది. మెయిన్స్ పరీక్షను జనవరిలో నిర్వహిస్తామని తొలిత ప్రకటించారు. అభ్యర్థుల ఒత్తిళ్లతో ఫిబ్రవరికి వాయిదా వేశారు. అయితే మెయిన్స్ పరీక్షల్లో రోస్టర్ విధానంతో ఫలితాలను ప్రకటించాలని అభ్యర్థులు నెలరోజులుగా డిమాండ్ చేస్తు న్నారు. ముఖ్యమంత్రితో సహా డిప్యూటీ సీఎం, విద్యాశాఖామంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలను అభ్యర్థులను కలిసి తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. ఈ క్రమంలో పరీక్ష వాయిదా పడే అవకాశముందని ప్రచారం జరిగింది. ఇంతలో ఏం జరిగిందోగానీ చివరకు పరీక్ష యథాతథంగా ఉంటుందని ఏపీపీఎస్పీ ప్రకటించడంతో అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జిల్లాలో ఆదివారం గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష యథావిధిగా జరుగుతుందని అధికారులు సైతం స్పష్టత ఇచ్చారు. 15 కేంద్రాల్లో 5535 మంది పరీక్షకు హాజరుకానున్నారని చెప్పారు. శ్రీకాకుళం మండలం పరిధిలో 8, ఎచ్చెర్ల మండలం పరిధిలో 7 కేంద్రాలను కేటాయించామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment