
సాగునీటి కాలువ ఆక్రమణ
సంతబొమ్మాళి: రియల్ ఎస్టేట్ వ్యాపారుల దౌర్జన్యం రైతుల పాలిట శాపంగా మారింది. కల్వర్టులు కప్పే సి, సాగునీటి కాలువ ఆక్రమించుకోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నౌపడ నుంచి టెక్కలి వైపు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఇజ్జువరం పంచాయతీ రైల్వేగేట్‌కు సమీపంలో సర్వే నంబర్ 355–1ఈ–355–1ఎఫ్‌లో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్‌ను వేశారు. ఈ లేఅవుట్‌లో గ్రావెల్ వేసి ఎత్తు చేసే క్రమంలో సాగునీటి కాలువను కప్పేసి దర్జాగా లే అవుట్‌లో కలిపేశారు. అంతటితో ఆగకుండా సాగునీరు ప్రవహించే కల్వర్టును కూడా కప్పేశారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఖరీఫ్‌లో తమ పొలాలకు నీరెలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. వంశధార అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చినా అవేమీ పట్టించుకోకుండా వారు తమ పనిని కొనసాగిస్తున్నారు. దీనిపై సంతబొమ్మాళి ఏఈ కె.అప్పలరెడ్డి మాట్లాడుతూ సాగునీటి కాలువ ఆక్రమించి కల్వర్టును కప్పేయడంతో సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.