
వైద్యం కోసం కిడ్నీ బాధితుడి పోరాటం
కాశీబుగ్గ: ఆయాసం వచ్చిందని పలాస కిడ్నీ పరిశోధన కేంద్రానికి వెళ్తే అత్యవసరంగా శ్రీకాకుళం వెళ్లిపోవాలని రిఫర్ చేయడం, అందుకు బాధితుడు అంగీకరించకపోవడం వివాదానికి దారితీసింది. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన టి.రమణ పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో కొన్నాళ్లుగా డయాలసిస్ సేవలు పొందుతున్నాడు. ఒక్కసారిగా ఆయాసం రావడంతో ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డుకు అష్టకష్టాలుపడి చేరుకున్నాడు. అయితే అక్కడి నుంచి రిఫర్ చేసేందుకు వైద్యసిబ్బంది ప్రయత్నాలు చేశారు. ప్రాణాలు పోయినా ఇక్కడే వైద్యం పొందుతానని, శ్రీకాకుళం వెళ్లి వైద్యం పొందే స్థోమత తనకు లేదని రమణ తేల్చిచెప్పాడు. రిఫరల్ పేరుతో వైద్యం అందించకుండా పంపించేయడం తగదని వాపోయాడు. దీంతో సిబ్బంది చివరికి పలాస కేంద్రంలోనే చికిత్స చేసేందుకు అంగీకరించారు. కాగా, కిడ్నీ బాధితులు, వారి కుటుంబాలతో ఆస్పత్రి సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అధికారులు స్పందించి కౌన్సిలింగ్ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.