
వంశధారను ఆధునీకరిస్తాం
నరసన్నపేట: జిల్లాలోని రైతులకు రెండు పంటలకు సాగునీరు అందేలా వంశధారను ఆధునీకరిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. మండలంలోని ఉర్లాం పంచాయతీ బడ్డవానిపేట వద్ద నూకాలమ్మ చానల్‌పై ప్రధానమంత్రి సడక్ యోజన నిధులు రూ.2.60 కోట్లతో నిర్మించనున్న వంతెన పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశధార ఆధునీకరణకు రూ.1,000 కోట్లు అవసరమని భావిస్తున్నామన్నారు. ఈ నిధులు ఎలాగైనా సమీకరించి పనులు చేయిస్తామన్నారు. అలాగే షట్టర్ల విషయంపై కూడా చర్చించి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదేవిధంగా ఉర్లాం రైల్వేస్టేషన్‌ను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. విశాఖ–భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌కు అనుమతి తీసుకు వస్తామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. షట్టర్లు బాగు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో ఉర్లాం సర్పంచ్ పోలాకి నర్సింహమూర్తి, వైఎస్సార్‌సీపీ నాయకుడు నడిమింటి శాంతారావు తదితరులు పాల్గొన్నారు.