
ఉరి..!
ఊరు బడికి
● టెక్కలి మండలంలోని బొరిగిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం 84 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 6 నుంచి 8 తరగతుల్లో 35 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఇదే తరగతులను సీతాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే తమ గ్రామంలోని ప్రాథమికోన్నత తరగతులను తరలిస్తే సహించేది లేదని, అవసరమైతే ఉన్నత పాఠశాలగా మార్చాలని గ్రామం మొత్తం విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. సీతాపురం ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే రైల్వే ట్రాక్, వంశధార ప్రధాన కాలువ దాటాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు.
టెక్కలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఎత్తుగడలు వేస్తోంది. దీనిలో భాగంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన తల్లికి వందనం పథకం ఒక ఏడాది ఎగ్గొట్టేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ట్యాబ్‌ల నిర్వాహణను గాలికొదిలేశారు. కాగా ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతులను ఎత్తివేసి, ఆయా గ్రామాలకు కొంతదూరంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. అయితే విలీనం కోసం విద్యాశాఖాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, గ్రామస్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత చోటుచేసుకోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రాథమికోన్నత స్థాయి తరగతుల విలీనం విధానంతో గ్రామాల్లోని విద్యార్థులు చదువులకు దూరం కావడమే కాకుండా, పరోక్షంగా ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తరగతుల విలీనానికి ప్రభుత్వం చర్యలు
పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర
ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
ప్రైవేటును ప్రోత్సహించడమేనని
ఆరోపణలు