యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. నాల్గవ రోజైన శుక్రవారం ఉదయం శ్రీస్వామి వారు వటపత్రశాయి అలంకార సేవలో.. సాయంత్రం హంస వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయంలో వేకువజామునే..
ప్రధానాలయంలో వేకువజామునే నిత్యారాధనలు, నిత్యపూజల అనంతరం ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు పారాయణీకులు వేద పారాయణం పఠించారు. అనంతరం ఉదయం 9.23 గంటలకు శ్రీస్వామి వారిని వటపత్రశాయి అలంకారంలో ప్రత్యేక పల్లకీపై అధిష్టించి ఆలయ తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం పడమటి రాజగోపురం ఎదుట గల వేంచేపు మండపంలో శ్రీస్వామిని ప్రత్యేక బల్లపై అధిష్టించి విశేషంగా ఆరాధించారు.
డోలు సన్నాయి మేళాలతో శ్రీస్వామికి మంగళకరమైన వాయిద్యాలతో కీర్తించారు. అలంకార సేవలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్‌తివారీ, ఆలయ ఈఓ గీతారెడ్డి, అనువంఽశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
సాయంత్రం వేళ..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి వారిని హంస వాహన అలంకార సేవలో అలంకరించి ఊరేగించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకారం నుంచి ప్రారంభమైన అలంకార సేవ పడమటి రాజగోపురం నుంచి ఉత్తరం, తూర్పు, దక్షిణ రాజగోపురాల ముందు నుంచి ముందుకు సాగింది. పడమటి రాజగోపురం ఎదుట గల వేంచేపు మండపంలో శ్రీస్వామి సేవను అధిష్టించి ఆచార్యులు వేదమంత్రాలను పఠించారు.
కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరం
శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా క్షేత్రానికి వచ్చే భక్తులకు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు వంశీకృష్ణ, హరీష్ నేతృత్వంలో ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. కొండపైన బస్టాండ్ వద్ద, కొండ కింద కల్యాణ కట్ట సమీపంలో భక్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నారు.
ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం సాయంత్రం డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం సభ్యులు కూచిపూడి ప్రదర్శన, అన్నమాచార్య ప్రాజెక్టు టీటీడీ బృందం వారిచే అన్నమాచార్య సంకీర్తనలు నిర్వహించారు.
♦ యాదాద్రి క్షేత్రంలో కొనసాగుతున్న శ్రీస్వామివారి బ్రహ్మోత్సవాలు
♦ ఉదయం వటపత్రశాయిగా..
♦ సాయంత్రం హంసవాహన సేవలో భక్తులకు దర్శనం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో శనివారం ఉదయం శ్రీస్వామి వారిని శ్రీకృష్ణాలంకరణ (మురళీ కృష్ణుడు) సేవ నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం పొన్నవాహన సేవ ఊరేగింపు జరిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment