నడిగూడెం : ప్రస్తుత రబీ సీజన్‌లో వరి పంట పెరిగే దశలోనూ, పలు ప్రాంతాల్లో చిరు పొట్ల దశల్లో ఉంది. అయితే వరి పంటకు చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఈ దశలో ఇష్టారాజ్యంగా పురుగు మందులు వాడొద్దని, మోతాదుగా వాడాలని సూర్యాపేట మండల వ్యవసాయాధికారి ఎండీ జానిమియా పేర్కొంటున్నారు. వరిసాగులో పాటించే సస్యరక్షణ చర్యలపై సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే..
కాండం తొలుచు పురుగు
ఈ పురుగు నారుమడి, పిలకదశ, అంకురం నుంచి చిరు పొట్టదశ వరకు ఆశిస్తుంది. పిలక దశలో మొవ్వు చనిపోతుంది. అంకురం నుంచి చిరుపొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్ల కంకులు బయటకు వస్తాయి. కంకి పాలు పోసుకోక తాలుపోతుంది. ఈ పురుగులు ఆలస్యంగా నాట్లు పెట్టిన లేదా ముదురు నాట్లు పెట్టిన పొలాల్లో ఆశిస్తాయి.
నివారణ చర్యలు
నాట్లు ఆలస్యమైనప్పుడు నారు కొనలను తుంచి వేసుకోవాలి. ఎకరానికి మూడు లింగాకర్షక బుట్టలు పెట్టి ప్రతివారం బుట్టలో పడే మగరెక్కల పురుగులను గమనించాలి. నష్ట పరిమితి స్థాయి దాటినప్పుడు మాత్రమే పురుగు మందులు పిచికారీ చేయాలి. దీనికి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రినిల్‌ప్రోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
సుడిదోమ(దోమపోటు)
ఈ పురుగు నారుమడి లేదా పిలకల దశలో అరుదుగా, పొట్టదశ, ఈనిక దశల్లో ఎక్కువగా ఆశిస్తుంది. నీటి పైభాగంలో మొక్కల మొదళ్ల దగ్గర దోమలు కనబడతాయి. పిల్ల, పెద్ద పురుగులు రసాన్ని పీల్చడం వల్ల పైరు సుడులుగా ఎండిపోతుంది. ఉధృతి ఎక్కువగా ఉంటే పొలం ఎండిపోయి పడిపోవడం, తాలు గింజలు లేదా నూర్చినప్పుడు నూకపోవడం జరుగుతుంది.
నివారణ చర్యలు
దోమను తట్టుకొనే రకాలను సాగు చేసుకోవాలి. నత్రజని అధిక మోతాదు తగ్గించుకోవాలి. కాలిబాటలు తీయాలి. ఎసిఫేట్ 1.5 గ్రా, లేదా ఎథోఫెన్‌ప్రాక్స్ 2.0 మి.లీ, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి..
పాముపొడ తెగులు
దుబ్బు చేసు దశ నుంచి కాండం, మట్ట, ఆకులపై మచ్చలు పెద్దవై పాము పొడ మచ్చలుగా ఏర్పడతాయి. మొక్కలు, పైరు పూర్తిగా ఎండిపోతుంది. తెగులు వెన్ను వరకు వ్యాపిస్తే తాలుగింజలు ఏర్పడతాయి.
నివారణ చర్యలు
విత్తన శుద్ధి చేయాలి. సిఫారసు మేరకు నత్రజని ఉపయోగించాలి. గట్లపై, చేనులో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. హెక్సాకొనాజోల్ 2. మి.లీ. లేదా ప్రాపికొనాజోల్ 1మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఉల్లికోడు లేదా గొట్టపు రోగం
ఇది నారుమడి, పిలక దశల్లో ఆశిస్తుంది. అంకురం ఉల్లి కాడవలె పొడగాటి గొట్టంలా మారి బయటకు వస్తుంది. కంకి వేయదు. దుబ్బుల్లో కొన్ని పిలకలు ఉల్లికాడవలె పొడగాటి గొట్టాలుగా మారతాయి.
నివారణ చర్యలు
దీనిని తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. ఆలస్యంగా నాట్లు వేసినప్పుడు కార్బోప్యూరాన్ 3జీ గుళికలను 10కిలోలు లేదా ఫోరెట్ 10జి గుళికలను 5 కిలోలు ఎకరానికి నారు నాటిన 10నుంచి 15 రోజులకు వేసుకోవాలి.
♦ అధికంగా పురుగు మందులు వాడితే పంటకు నష్టం
♦ సస్యరక్షణ చర్యలు పాటించాలంటున్న వ్యవసాయాధికారి ఎండీ జానిమియా
తొలిదశలో ఆకులపైన నూలు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడి క్రమేణా అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఇవి విస్తరించి మచ్చలు, చివర్లు మొనదేలి ఉంటాయి. ఈ మచ్చల అంచులు ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండి ఆకులు కాలిపోయినట్లుగా వ్యాపిస్తుంది. సిఫారసు మేరకు కాకుండా నత్రజని ఎరువుల అధిక మోతాదుల్లో వాడడం, గాలిలో తేమ అధికంగా ఉండడం, మబ్బుతో కూడిన వాతావరణం, సన్నని వర్షపు జల్లులు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం.
నివారణ చర్యలు
విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. పైరుపై తెగులు లక్షణాలు కనిపిస్తే పొలంలో నీటిని తీసివేయాలి. బాగా ఆరనివ్వాలి. దీని వల్ల శిలీంద్రం తాలూకు సిద్ధ బీజాలు నశిస్తాయి. ట్రైసైక్లేజోల్ 1.5గ్రాములు లేదా కాసుగామైసీన్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Comments
Please login to add a commentAdd a comment