భానుపురి (సూర్యాపేట) : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. జిల్లా అధికారులందరూ ప్రజా సమస్యలను తీర్చడంలో మంచిగా విధులు నిర్వహిస్తున్నారని, ఎల్లప్పుడూ ఇదే ఒరవడిని కొనసాగించాలన్నారు.ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 22 దరఖాస్తులు, డీఆర్‌డీఏ 9, పంచాయతీ రాజ్ శాఖ 6, ఇతర శాఖలు 21ఽ దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. అంతకుముందు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 7 నుంచి మార్చి 17 వరకు జరిగిన 100 రోజుల కార్యక్రమంలో 1,13,961 మందికి స్క్రీనింగ్ టెస్ట్‌లు చేశామని, అందులో 17,838 మందిని అనుమానితులుగా గుర్తించి పరీక్షలు చేశామన్నారు. వీరిలో 491 మంది టీబీ రోగులను గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీఎంహెచ్‌ఓ అశోక్, డీపీఓ యాదయ్య, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్, సంక్షేమ అధికారులు లత, శంకర్, జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి