
వేసవి క్రీడా శిబిరాలకు వేళాయే
హుజూర్‌నగర్ : గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలికితీసి వారికి తర్ఫీదు ఇచ్చి అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించాలని తలపెట్టారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు, జాతీయ స్థాయి క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు.
జిల్లాలో 10 క్రీడా శిబిరాలు..
క్రీడా శిబిరాల నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు నిధులు కేటాయించనుంది. క్రీడా సామగ్రి కొనుగోలుకు నిధులతోపాటు, శిక్షకులకు ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున గౌరవ వేతనం అందజేయనుంది. ఇందుకోసం సూర్యాపేట జిల్లాలో 10 శిబిరాలకు రూ 4 వేల చొప్పున రూ.40 వేలు, నిర్వహణ ఖర్చు, ప్రథమ చికిత్స కిట్ల కొనుగోలుకు నిధులు ఇవ్వనున్నారు. శిబిరాల నిర్వహణకు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, యువజన, క్రీడల శాఖ అధికారి శిబిరాల నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించనున్నారు. ఈ శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 2న చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది.
14 ఏళ్లలోపు బాల, బాలికలకు మాత్రమే..
పూర్తిగా గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు వివిధ ఆటల్లో శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ శిబిరంలో చేరడానికి 14 ఏళ్లలోపు బాలబాలికలు మాత్రమే అర్హులు. జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ వేసవి క్రీడాశిబిరాలను సద్విని యోగం చేసుకుని ఆయా క్రీడల్లో మెళకువలు నేర్చుకునేందుకు ఇది మంచి అవకాశం.
ఫ దరఖాస్తులకు నేడు చివరి తేదీ
ఫ జిల్లాలో 10 శిబిరాల ఏర్పాటుకు
ప్రభుత్వం నిర్ణయం
ఫ మే 1 నుంచి క్రీడాకారులకు శిక్షణ
జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి
ఆసక్తి గల శిక్షకులు నిర్వహించే క్రీడలు, ప్రదేశం, గ్రామం, సెల్ నంబర్ తదితర వివరాలతో కూడిన దరఖాస్తులను కలెక్టరేట్‌లోని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి. ఈ నెల 2వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తు చేయవచ్చు.
–జి.రాంచందర్‌రావు, జిల్లా యువజన,
క్రీడల శాఖ అధికారి, సూర్యాపేట