
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం
గ్రామ పోలీసు అధికారి
వ్యవస్థ బలోపేతం చేయాలి
సూర్యాపేటటౌన్ : పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను బలోపేతం చేసేలా ప్రణాళిక రూపొందించామని ఎస్పీ కె.నరసింహ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి బుధవారం పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలు గుర్తించడం, చట్టాలు, భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం, సమస్యలు సృష్టించే వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా నేరాలను అదుపుచేయడమే ఈ కార్యక్రమంలో ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ మట్టయ్య, ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, సీఐలు చరమంద రాజు, రజిత, శివశంకర్, రాజశేఖర్, వీర రాఘవులు, రామకృష్ణారెడ్డి, రఘువీర్‌రెడ్డి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ హరిబాబు, సైబర్ సెక్యూరిటీ సీఐ లక్ష్మీనారాయణ, ఆర్‌ఐ నారాయణ రాజు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
పోలీసులకు రివార్డు
సూర్యాపేటటౌన్ : కోదాడ పట్టణంలో 2023 సంవత్సరం నవంబర్ నెలలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నవారిని అరెస్టు చేసి రూ.68 వేలు సీజ్ చేసి వారిని కోర్టులో హాజరుపరిచారు. సీజ్ చేసి కోర్టుకు పంపిన రూ.68 వేలలో రూ.34 వేలను పోలీసులకు రివార్డ్‌గా ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఆ సమయంలో పనిచేసిన సీఐ రాము, ఎస్‌ఐ రామాంజనేయులు, కానిస్టేబుళ్లు ఆంజనేయులు, సతీష్, వెంకటేశ్వర్లు, శ్రీనులకు రివార్డ్ నగదును ఎస్పీ నరసింహ మంగళవారం అందజేశారు.
సూర్యాపేటటౌన్ : సైబర్ నేరగాళ్లు అత్యాశ చూపి అందినంత దండుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్లు, క్యూర్ కోడ్స్, లింక్‌లు పంపి క్లిక్ చేయాలని, బహుమతులు వచ్చాయని, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా సరిచూసుకోవాలని చెప్పి డబ్బులు కాజేస్తున్నారు. అప్రమత్తతతో సైబర్ నేరాలను అరికట్టవచ్చని అంటున్నారు ఎస్పీ కే నరసింహ. ప్రజలు సైబర్ నేరగాళ్ల మోసాల బారిన పడకుండా సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే..
మోసాలు ఇలా..
● కాల్ సెంటర్లు, సైబర్‌క్రైం పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేస్తారు.
● బ్యాంక్ ఉద్యోగి అని చెప్పి ఖాతాదారుడికి ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు, ఆధార్‌కార్డు, పాన్ కార్డు లాంటి వివరాలు అడుగుతారు.
● తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయి అని ఆశపెడతారు.
● ఫోన్‌కు, మెయిల్‌కు, సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్ట్రాగాంలలో మెసేజ్‌లు, బ్లూ లింక్ పంపుతారు.
● బహుమతులు వచ్చాయని, తక్కువ రేటుకు వస్తువులు వాహనాలు ఉన్నాయని, మంచి ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్‌కు ఫీజు కట్టాలి అని చెబుతారు.
● మీ పిల్లలు డ్రగ్స్ కేసులో, అక్రమ రవాణా కేసుల్లో ఇరుకున్నారని, కేసుల నుంచి తప్పిస్తాం అంటూ కస్టమ్స్, సీఐడీ, ఈడీ, సైబర్ క్రైం పోలీసు అధికారులం అంటూ బెదిరింపులకు గురి చేస్తారు
సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే..
● లోన్ యాప్‌లకు దూరంగా ఉండాలి.
● సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయినా, మీ డబ్బు పోగొట్టుకున్నా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి
● కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్‌లో వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
● అపరిచిత నంబర్ల నుంచి ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించవద్దు.
● లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్‌ను నమ్మవద్దు.
● పాస్వర్డ్, ఓటీపీ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.
● బ్యాంక్‌లో వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తాం అంటే ఎవ్వరికీ ఆధార్, బ్యాంక్ ఖాతా లాంటివి చెప్పవద్దు.
● సైబర్ నేరం జరిగిన మొదటి గంటలోనే (గోల్డెన్ అవర్) ఫిర్యాదు చేయడం ద్వారా స్కామర్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసి పోయిన డబ్బు రికవరీ చేయడం సులభం అవుతుంది.
ఫ లింక్ క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ
ఫ ఎస్పీ నరసింహ

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం