
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులను ప్రోత్సహించాలి
గరిడేపల్లి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేసుకునేవిధంగా గర్భిణులను ప్రోత్సహించాలని డీఎంహెచ్‌ఓ కోటాచలం అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) కార్యక్రమంలో భాగంగా 30 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వేసవి కాలంలో ప్రజలు తమ పనులను ఉదయం 11 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తర్వాత చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్పనిసరిగా గొడుగు తీసుకుని వెళ్లాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవి కాలంలో తీసుకునే జాగ్రత్తలపై ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించాలన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి మందులు వాడేటట్లు చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా టీబీ అధికారి డాక్టర్ నజీయా, ఏఓ డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ నరేష్, ఎస్‌ఓ వీరయ్య, సతీష్, శారద, అంజయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.