
సాక్షి, చైన్నె: ప్రైవేటు సంస్థల్లో పని వేళలు 8 గంటల నుంచి 12 గంటలకు పొడిగిస్తూ అసెంబ్లీ వేదికగా తీసుకొచ్చిన చట్టం వివాదానికి దారి తీసింది. దీనిని వ్యతిరేకిస్తూ డీఎంకే మిత్ర పక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ఆ పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు శనివారం రాష్ట్రంలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. వివరాలు.. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలలో పని వేళలను 12 గంటలుగా నిర్ణయిస్తూ అసెంబ్లీ వేదికగా శుక్రవారం చట్టం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని డీఎంకే మిత్ర పక్ష పార్టీలు అసెంబ్లీ వేదికగా ఈ చట్టానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాయి.
దీనిని పట్టించుకోని పాలకులు చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టం కారణంగా కార్మికులకు పని భారం పెరగనుందని, ఉప సంహరించుకోవాలని నినాదిస్తూ డీఎంకే మిత్ర పక్షాలకు చెందిన సీఐటీయూ, ఏఐటీయూసీ, తదితర కార్మిక సంఘాలు శనివారం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. మదురై, తిరునల్వేలి, రామనాథపురంలో నిరసనలు హోరెత్తాయి. రామేశ్వరం అగ్ని తీర్థంలోకి దిగి మరీ తమ నిరసనను కార్మిక సంఘాలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం అవుతాయన్న హెచ్చరించారు.
ఇక ఈ చట్టాన్ని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికుల జీవితాలతో చెలాగాటాలు వద్దు అని హెచ్చరించారు. గతంలో కేంద్రం ఇచ్చిన ఈ ఆదేశాలను తాము అమలు చేయడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే, ఇప్పుడు దీనిని అమలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ఈ చట్టం వివాదానికి దారి తీయడం, కార్మికుల్లో నెలకొన్న ఆందోళనను నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 24వ తేదీ అన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి, ఈ చట్టం గురించి వివరించనున్నారు.