అభివాదం చేస్తున్న పన్నీరు సెల్వం
సాక్షి, చైన్నె: మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుచ్చి వేదికగా సోమవారం తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. మద్దతుదారులు రెండు లక్షల మేరకు ఈ మహానాడుకు మద్దతుదారులు తరలిరావడం గమనార్హం. వివరాలు.. అన్నాడీఎంకేను చేజిక్కించుకునే విషయంపై ఆ పార్టీకి చెందిన మాజీ సీఎంలు పన్నీరు, పళణి స్వామి మధ్య పెద్ద పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. న్యాయ పోరాటంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌తో జరిపిన సంప్రదింపులతో అన్నాడీఎంకేను పళణి స్వామి కై వసం చేసుకున్నారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామిరాజకీయ చక్రం తిప్పుతున్నారు. అయితే న్యాయ పోరాటంలో తుది గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్న పన్నీరు సెల్వం సోమవారం తిరుచ్చి వేదికగా తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. తిరుచ్చి వేదికగా ముప్పెరుం విళాగా సాయంత్రం ఐదున్నర గంటల నుంచి మహానాడు ప్రారంభమైంది. గంట పాటుగా దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితలు నటించిన చిత్రాలలోని పాటలను గాయకులు పాడుతూ పన్నీరు మద్దతు దారులలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. రాత్రి ఏడున్నర గంటలకు వేదికపై పన్నీరు సెల్వం, ఆయన తనయుడు, ఎంపీ రవీంద్రనాథ్, పార్టీ నేతలు బన్రూటి రామచంద్రన్, వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీటీ ప్రభాకర్, వెల్లమండి నటరాజన్, కూపా కృష్ణన్‌లు వచ్చారు.
మద్దతు దారులను పలకరించేందుకు వీలుగా పన్నీరు సెల్వం కోసం ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేశారు. మద్దతు దారుల వద్దకు నడుచుకుంటూ వెళ్లి ఆయన అభివాదం తెలియజేశారు. పళణి స్వామి, ఆయన బృందాన్ని ఉద్దేశించి పన్నీరు సెల్వం తన ప్రసంగంలో విరుచుకు పడ్డారు. కోర్టు తుది తీర్పుతో అన్నాడీఎంకేను కై వసం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. కాగా, తన సామాజిక వర్గం వెన్నంటి ఉంటుందని, లక్షల్లో తరలి వస్తారని భావించిన పన్నీరు సెల్వం చివరకు రెండు లక్షల మంది మేరకు మద్దతుదారులతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే ప్రచారం సాగుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment