సాక్షి, చైన్నె: బాధ్యత గల పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి తక్షణం ఆ పదవి నుంచి తప్పుకోవాలని డీఎంకే మిత్రపక్షాలు డిమాండ్ చేశాయి. ద్రావిడ మోడల్ కాదు...సనాతన ధర్మం కాలం చెల్లిందని మంత్రి పొన్ముడి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతలను విస్మరించి రాజకీయ అవతారంతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా మారిన గవర్నర్‌కు వ్యతిరేకంగా పోరాట బాటకు సిద్ధమవుతున్నామని సీపీఎం నేత బాలకృష్ణన్ ప్రకటించారు.
మొదటి నుంచి గవర్నర్ ఆర్‌ఎన్ రవి వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు, వివాదాలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఓ ఆంగ్ల మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ మరింత చర్చకు దారి తీసింది. ఆయన రాజకీయనాయకుడిగా మారారని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. ఆ ఇంటర్వ్యూలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి చేసిన వ్యాఖ్యలను డీఎంకే మిత్రపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. శుక్రవారం మిత్ర పక్ష పార్టీల నేతలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తీరును ఎండగట్టే విధంగా విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టారు.
విమర్శల దాడి..
ఉన్నత విద్యా మంత్రి పొన్ముడి స్పందిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ అవతారం ఎత్తారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతికి దోహద పడాల్సిన గవర్నర్, రాష్ట్రాన్ని పాతాళంలోకి ఎలా నెట్టాలో అనే వ్యూహాలకు పదును పెట్టినట్టున్నారని ధ్వజమెత్తారు. ద్రావిడ మోడల్ ఎల్లప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుందని, సనాతన ధర్మం ఇప్పటికే కాలం చెల్లినట్టు విమర్శించారు. మైనారిటీ కమిషన్ చైర్మన్ పీటర్ అల్బోన్స్ మాట్లాడుతూ గవర్నర్ ఇటీవల కాలంగా తన పదవికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఆయన ఓ ప్రజాప్రతినిధిగా, రాజకీయనాయకుడిగా మారి, ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు బెడుతుండడం శోచనీయమని మండిపడ్డారు. సీపీఎం నేత బాలకృష్ణన్ స్పందిస్తూ, రాజకీయాలపై గవర్నర్‌కు ఉత్సాహం ఎక్కువగానే ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు బాధ్యత గల పదవి నుంచి తప్పుకుని, ఆ తర్వాత రాజకీయాలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. ఈయన తీరును ఎండగట్టే విధంగా డీఎంకే మిత్ర పక్షాలను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం అవుతున్నామన్నారు. సీపీఐ నేత ముత్తరసన్ పేర్కొంటూ పబ్లిసిటీ ప్రియుడిగా గవర్నర్ మారారని, అందుకే ఏదో ఒక విమర్శ, ఆరోపణలు, వివాదాలతో కాలం నెట్టకొస్తున్నట్టు విమర్శించారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే, పదవికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా మారిపోవాలని హితవు పలికారు.
వీసీకే నేత తిరుమావళవన్ స్పందిస్తూ, ఆయన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలా వ్యహరిస్తున్నారే గానీ, ఆయనలో గవర్నర్‌కు ఉండాల్సిన లక్షణాలు లేవు అని మండిపడ్డారు. అలాగే, డీఎంకే మిత్ర పక్షాలకు చెందిన మరికొన్ని పార్టీల నేతలు గవర్నర్‌కు వ్యతిరేకంగా స్పందిస్తూ, ఆయన్ను బర్త్‌రఫ్ చేయాలన్న నినాదాన్ని మళ్లీ అందుకున్నారు.సేలం జిల్లా వాళప్పాడిలో ద్రావిడ మోడల్ పాలన గురించి చర్చనీయాంశంగా గవర్నర్ ఆర్.ఎన్.రవి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ డీఎంకే కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేసిన సంఘటన ఆ ప్రాంతంలో శుక్రవారం కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment