
టీఆర్ బాలు, అన్నామలై
సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై డీఎంకే పార్లమెంటరీ నేత, పార్టీ కోశాధికారి టీఆర్ బాలు శుక్రవారం పరువునష్టం దావా వేశారు. సైదాపేట కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. డీఎంకే అవినీతి అక్రమాలు అంటూ గత నెల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ జబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది వివాదానికి దారి తీసింది. అన్నామలైకు డీఎంకే వర్గాలు నోటీసులు పంపిస్తూ వివరణ కోరుతున్నాయి. ఆయన స్పందించకపోవడంతో కోర్టులో పిటిషన్ల దాఖలుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే అన్నామలైపై సీఎం స్టాలిన్ పరువునష్టం దావా వేశారు. తాజాగా టీఆర్ బాలు కూడా దావా దాఖలు చేశారు. సైదాపేట కోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఆధార రహిత ఆరోపణలు చేసి తన పరువుకు అన్నామలై భంగం కలించారని టీఆర్‌బాలు ఆ పిటిషన్‌లో వివరించారు. వివరణ కోరుతూ నోటీసులు పంపినా సమాధానం లేదని, అందుకే అన్నామలైపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసినట్టు కోర్టుకు సూచించారు. ఈ సందర్భంగా టీఆర్‌బాలుతో కలిసి డీఎంకే నిర్వాహక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి మీడియాతో మాట్లాడుతూ, అన్నామలై జైలుకు వెళ్లే రోజులు సమీపించాయన్నారు. ఆధార రహిత ఆరోపణలు చేయడమే కాకుండా, వివరణ కోరుతూ నోటీసులు పంపించిన వారిపై ఆయన ఎదురుదాడి చేయడం శోచనీయమన్నారు.
తాజాగా దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా అన్నామలైకు ఏడాది జైలు శిక్ష తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తనపై ఎన్ని కేసులు వేసినా తగ్గేదేలే అన్నట్టుగా అన్నామలై ఉన్నారు. ఈ దావా గురించి మీడియా ఆయన్ను కదిలించగా, ఎన్ని కేసులైనా వేసినా, డీఎంకే అవినీతిని బట్టబయలు చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. జూలైలో డీఎంకే అవినీతి ఫైల్స్ రెండో భాగం విడుదల కాబోతోందని ప్రకటించారు.