
సాక్షి, చైన్నె: ధర్మపురి కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారి మలర్ వెళి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి స్వతంత్రంగా వ్యవహరించి రూ. 1.36 కోట్ల నిధులను పక్కదారి పట్టించినట్టు డెరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్ (డీవీఏసీ) విచారణలో తేలింది. దీంతో ఆమెతో పాటు సన్నిహితంగా కాంట్రాక్టర్లు ఇరువురిపై కేసు నమోదు చేశారు. మంగళవారం చైన్నె, ధర్మపురి, విల్లుపురం, పుదుకోట్టైలో ఆ ముగ్గురికి చెందిన 10 చోట్ల విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. వివరాలు.. 2018–20 మధ్య ధర్మపురి జిల్లా కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి మలర్ వెళి పనిచేశారు.
ఈ కాలంలో ఆ జిల్లాల్లోని 251 పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో ఆస్తి, నీరు, వర్తకం తదితర పన్నుల వసూళ్లకు గాను ప్రభుత్వం తరపున లక్షా 25 వేల పుస్తకాలను ముద్రించారు. అయితే దీన్ని టెండర్ల ద్వారా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించి.. తనకు కావాల్సిన వ్యక్తులైన క్రెసెంట్ తాహీర్ హుస్సేన్, నాగా ట్రేడర్స్ వీరయ్య పళణి వేల్‌కు పనులను ఏకపక్షంగా అప్పగించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అధిక మొత్తాలను వారికి ముట్ట చెప్పినట్లు గణాంకాల్లో తేలాయి. ఫలితంగా ప్రభుత్వ సొమ్ము రూ.1.36 కోట్లు ఈ పనుల కారణంగా దుర్వినియోగమైనట్లు తెలిసింది. దీంతో ధర్మపురి, సేలం విజిలెన్స్ డీఎస్పీ కృష్ణరాజన్ నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది.
కేసు నమోదు
ప్రస్తుతం ఐఏఎస్ అధికారి మలర్ వెళి సైన్స్ సిటీ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు తాహీర్ హుస్సేన్, వీరయ్య పళణి వేల్‌పై సోమవారం సాయంత్రం డీవీఏసీ వర్గాలు కేసు నమోదు చేశాయి. మంగళవారం ఉదయం మలర్ వెళితోపాటు తాహీర్ హుస్సేన్, వీరయ్య పళణి వేల్‌లకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు డీవీఏసీ అధికారులు రంగంలోకి దిగారు.
చైన్నె విరుగంబాక్కంలోని మలర్ వెళి నివాసంలో డీఎస్పీ కృష్ణరాజన్ బృందం సోదాల్లో నిమగ్నమైంది. చైన్నెలోని క్రెసెంట్, నాగా ట్రేడర్స్ కార్యాలయాల్లోను, విల్లుపురం, ధర్మపురి, పుదుకోట్టైలోనూ తనిఖీలు చేపట్టారు. మొత్తంగా 10 చోట్ల డీవీఏసీ సోదాలు జరుగుతున్నాయి. ఇందులో పలు ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment