రజనీకాంత్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న పన్నీరు సెల్వం
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వం కొత్త పార్టీ ఏర్పాటుకు ముందుగా తన బలాన్ని చాటుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పురట్చి (విప్లవ) పయనం పేరిట జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆదివారం కాంచీపురం నుంచి తన ప్రయాణాన్ని మొదలెట్టారు. వివరాలు.. అన్నాడీఎంకేను కై వసం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం చేసిన విశ్వ ప్రయత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో, కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద ఆయనకు చుక్కెదురైంది. ఇదే సమయంలో ప్రత్యర్థి పళణి స్వామి అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి.
దీంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆపార్టీని పూర్తిగా పళణి స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం పన్నీరు జీర్ణించుకోలేకున్నారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు సైతం తనను విస్మరించడంతో అన్నాడీఎంకే దూరమైనట్టే అన్న నిర్ణయానికి వచ్చేశారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో రాజకీయ ఉనికిని చాటుకునేందుకు, తనను నమ్ముకున్న వారి కోసం అమ్మడీఎంకే ఏర్పాటు కసరత్తుల్లో ఉన్నట్టు తెలిసింది. అలాగే తన కోసం ప్రత్యేకంగా ఓ పత్రికను సైతం స్థాపించడం గమనార్హం.
పార్టీ ఏర్పాటుకు ముందుగా తన బలాన్ని చాటుకునే విధంగా , పళణి వ్యతిరేకులను తన వైపునకు తిప్పుకునే రీతిలో పురట్చి పయనం పేరిట జిల్లాల పర్యటనకు ఆదివారం పన్నీరు శ్రీకారం చుట్టారు. కాంచీపురం కళియనూరు బహిరంగ సభతో తన ప్రచార ప్రయాణాన్ని మొదలెట్టారు. అందరూ ఐక్యంగా ఉంటేనే లోక్‌సభ ఎన్నికల్లో విజయం అని లేకుంటే ఓటమి తప్పదని పన్నీరు వ్యాఖ్యానించారు. వారంలో రెండు జిల్లాలను ఎంపిక చేసిన బహిరంగ సభలతో పురట్చి పయనాన్ని పన్నీరు విస్తృతం చేయనున్నారు.
దేవుడికే తెలుసు..
మదురై మీనాక్షి అమ్మవారి దర్శనానికి వచ్చిన సత్యనారాయణ రావు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రజనీకాంత్ గవర్నర్ కాబోతున్నారా? అని ప్రశ్నించగా, అది దేవుడి చేతిలోనే అంటూ సమాధానం ఇచ్చారు. రజనీ రాజకీయాల్లోకి వస్తారా? అని ప్రశ్నించగా వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పన్నీరు సెల్వం భేటీ గురించి ప్రశ్నించగా, ఇందులో రాజకీయాలు ఏమీ లేవు అని సమాధానం ఇచ్చారు.
రజనీతో భేటీ
తొలుత పోయెస్ గార్డెన్‌లో సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో పన్నీరు సెల్వం భేటీ కావడం చర్చకు దారి తీసింది. రజనీకాంత్‌కు బీజేపీ పెద్దలతో సన్నిహితం ఉన్న దృష్ట్యా, ఆయన ద్వారా కేంద్రం ఆశీస్సులను తిరిగి పొందేందుకు పన్నీరు ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. మూసుకు పోయిన బీజేపీ తలుపులను రజనీ కాంత్ ద్వారా తెరిపించుకునే వ్యూహంతో పన్నీరు ఉన్నట్టుగా చర్చ జోరందుకోవడం గమనార్హం. అయితే, ఈ భేటీలో ఎలాంటి రాజకీయం లేదని రజనీ సోదరుడు సత్యనారాయణ రావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment