
మాట్లాడుతున్న అన్నామలై
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో హైకోర్టు సుమోటోగా స్వీకరించిన కేసుల రూపంలో త్వరలో మరికొందరు డీఎంకేమంత్రులు జైలుకు వెళ్లబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యలు చేశారు. వీరంతా ఏఏ జైళ్లల్లో ఉండనున్నారో...? తేలే సమయం ఆసన్నం అవుతోందన్నారు. డీఎంకేకు వ్యతిరేకంగా అవినీతి ఫైల్స్ పేరిట రెండు జాబితాలను అన్నామలై విడుదల చేసిన విషయం తెలిసిందే.
తొలి జాబితా విడుదల తదుపరి పరిణామాలతో మంత్రి సెంథిల్ బాలాజీ కటకటాల పాలయ్యారు. రెండో జాబితా విడుదల కాగానే ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడిని ఈడీ టార్గెట్ చేసింది. త్వరలో మరో ఫైల్ అంటూ అన్నామలై పేర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నా మట్టి..నా ప్రజలు పాదయాత్రలో భాగంగా శనివారం తేనిలో జరిగిన కార్యక్రమంలో అన్నామలై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.