
తమిళసినిమా: బెంగాలీ భామ మృణాళ్ ఠాకూర్ ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా వెలిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ దక్షిణాదిలో నటించిన తొలి చిత్రం సీతారామం. తెలుగులో రూపొందిన ఈ చిత్రంలో ఈ అమ్మడు దుల్కర్ సల్మాన్‌తో జత కట్టారు. చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈమె పేరు బాగా పాపులర్ అయ్యింది.
నాని సరసన నటించిన హాయ్ నాన్నా చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. దీంతో మృణాళ్ ఠాకూర్‌కు పట్ట పగ్గాలు లేకుండా పోయాయనే చెప్పాలి. అలాంటి సమయంలో తమిళంలో ఏఆర్.రెహ్మాన్ దర్శకత్వంలో శివకార్తీకేయన్‌కు జంటగా నటించే అవకాశాన్ని తిరస్కరించారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా విజయ్‌దేవరకొండతో రొమాన్స్ చేసిన ఫ్యామిలీస్టార్ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ఇది ఈ అమ్మడి క్రేజ్‌కు కాస్త బ్రేక్ వేసినట్లే అవుతుంది.
దక్షిణాదిలో నటించిన తొలి చిత్ర జ్ఞాపకాలను ఈ అమ్మడు ఇంకా మరువలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక బేటీ లో తనకు మిత్రుడు, మార్గదర్శి అంతా నటుడు దుల్కర్ సల్మాన్ అని పేర్కొన్నారు. సీతారామం చిత్రం షూటింగ్ సమయంలో ఆయన సహకారం మరువలేనిదని అన్నారు. ఇక చాలా కష్టమైన విషయం ఏమిటంటే ఒక చిత్రాన్ని పూర్తి చేసి వెళుతున్నప్పుడు హృదయం పగిలినట్లు అనిపిస్తుందన్నారు.
తాను ఒక చిత్రంలోని పాత్రను ఇష్టపడి నటిస్తే ఆ పాత్రగా మారిపోతానని అన్నారు. అలా నటించిన పాత్రే సీతారామం చిత్రంలోని సీతామహాలక్ష్మి పాత్ర అని పేర్కొన్నారు. ఈ పాత్ర నుంచి బయట పడటానికి చాలా సమయం పట్టిందని నటి మృణాళ్ ఠాకూర్ అన్నారు. కాగా అందాలారబోతకు ఏమాత్రం వెనుకాడని ఈ అమ్మడు త్వరలోనే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment