మాకేదీ భద్రత?
● పెరుగుతున్న దాడులపై ఆగ్రహం
● అన్నాడీఎంకే మహిళా విభాగం నిరసనల హోరు
సాక్షి, చైన్నె: మహిళలకు ఏదీ భద్రత? అనే నినాదంతో అన్నాడీఎంకే అనుబంధ మహిళా విభాగం నేతృత్వంలో చైన్నెలో మంగళవారం భారీ నిరసన క్యాక్రమం జరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి పిలుపు మేరకు మహిళా విభాగం నేతృత్వంలో రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు,హత్య ఘటనలను నిరసిస్తూ వళ్లువర్ కోట్టం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళకు ఏదీ భద్రతా..?ఎక్కడ స్వేచ్ఛ అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మహిళా నేతలు నినదించారు. రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి, మాజీ మంత్రి పి.వలర్మతి అధ్యక్షతన జరిగిన ఈ నిరసనకు పెద్దఎత్తున మహిళలు తరలివచ్చారు. వలర్మతి మాట్లాడుతూ, డీఎంకే ప్రభుత్వం కేవలంలో పబ్లిసిటీకే పరిమితమైందని ధ్వజమెత్తారు. మహిళలకు ఆ పథకాలు, ఈ పథకాలు అంటూ ప్రగల్భాలు పలుకుతూ, దొడ్డిదారిన నెత్తి భారాన్ని వేస్తూ వస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీలను పెంచేశారని, నిత్యావసర వస్తువులకు రెక్కలు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాల మత్తులో మునిగి ఉందని, మహిళలు, బాలికలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ నిరసనకు హాజరైన మహిళలు అందరూ నల్ల చీరలను ధరించి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ గోకుల ఇందిర, అధికార ప్రతినిధి, సినీ తారలు వింధ్య, గాయత్రీరఘురాం తదితరులు ప్రసంగిస్తూ, డీఎంకే ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment