కలవనూ లేదు చూడనూ లేదు! | - | Sakshi
Sakshi News home page

కలవనూ లేదు చూడనూ లేదు!

Published Wed, Dec 11 2024 12:42 AM | Last Updated on Wed, Dec 11 2024 6:14 PM

సభలో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్‌

సభలో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్‌

అదానీ వ్యవహారంపై అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ స్పష్టీకరణ 

పీఎంకే వాకౌట్‌ 

సాత్తనూరు డ్యాం గేట్ల ఎత్తివేతపై రచ్చ 

సీఎం, ప్రతిపక్ష నేత మధ్య మాటల యుద్ధం

అసెంబ్లీలో అదానీ పవర్‌ వివాదాన్ని మంగళవారం పీఎంకే తెర మీదకు తెచ్చింది. అయితే అదానీని తాను కలవనూ లేదు.. ఇంత వరకు చూడనూ లేదంటూ సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఆయన వివరణతో ఏకీభవించని పీఎంకే సభ్యులు వాకౌట్‌ చేశారు. ఇక సాత్తనూరు డ్యాం గేట్ల ఎత్తి వేత వ్యవహారం సభలో దుమారాన్ని రేపింది. అన్నాడీఎంకే సభ్యులు, మంత్రుల మధ్య మాటల యుద్దం సాగింది. చివరకు సీఎం వర్సెస్‌ ప్రధాన ప్రతి పక్ష నేత మధ్య మాటల తూటాలు పేలాయి.

సాక్షి, చైన్నె : అసెంబ్లీ సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభం కాగానే, స్పీకర్‌ అప్పావు సంతాప తీర్మానం తీసుకొచ్చారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు సభ్యులు మౌనం పాటించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు జరిగాయి. తిరువణ్ణామలై కొండ మీద ఈ ఏడాది కూడా మహాదీపం వెలుతుందని ఓ సభ్యుడి ప్రశ్నకు హిందూ, ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు సమాధానం ఇచ్చారు. వృథా అవుతున్న నీటిని పరిరక్షించే విధంగా వెయ్యి చెక్‌ డ్యాంలను నిర్మించబోతున్నామని, తమ శాఖకు మరింత నిధులు అవసరం ఉందని నీటి పారుదల శాఖమంత్రి దురై మురుగన్‌ మరో సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

తమిళ తాతగా పిలవబడే యూవీ స్వామినాథన్‌ జయంతి రోజైన ఫిబ్రవరి 19వ తేదీని ఇలక్కియ మరుమలర్చి నాల్‌గా ( సాహిత్య పునర్జీవన దినోత్సవం)గా ప్రకటించాలని అన్నాడీఎంకే సభ్యుడు కేపీ మునుస్వామి చేసిన విజ్ఞప్తికి సీఎం స్టాలిన్‌ స్పందిస్తూ ఆచరణలో పెడుతున్నామని ప్రకటించారు. రోడ్ల మీద స్వైర విహారం చేస్తున్న ఆవులు, పశువులు, వీధి కుక్కల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని నగరాభివృద్ధి శాఖమంత్రి కేఎన్‌ నెహ్రూ మరో సభ్యుడికి ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. 

కోయంబత్తూరు కార్పొరేషన్‌ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ. 300 కోట్లు కేటాయించామని ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యుడుసెల్వపెరుంతొగై స్పందిస్తూ, తన నియోజకవర్గం పరిధిలో తరచూ కొన్ని ప్రాంతాలు వర్షాలతో వర ముంపునకు గురి అవుతున్నాయని, ఇందుకు త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపించాలని విన్నవించడంతో పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మళ్లీ తాను పోటీ చేయాలా? వద్దా? అన్నది మంత్రి చేతిలోనే ఉందంటూ ఈ సందర్భంగా సెల్వ పెరుంతొగై చమత్కరించారు.

వాటర్‌ వార్‌

ఫెంగల్‌ తుపాన్‌ సమయంలో సాత్తనూరు డ్యాంను రాత్రికి రాత్రే తెరవడంతో తెన్‌ పైన్నె నది ఉప్పొంగి విల్లుపురం, కడలూరు జిల్లాలోని వందలాది గ్రామాలను జలదిగ్భంధంలో ముంచేసినట్టుగా ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అసెంబ్లీకి చేరింది. 2024–25 సంవత్సరానికి గాను అదనపు వ్యయం వ్యవహారంలో దాఖలైన అను బంధ బడ్జెట్‌ చర్చ సమయంలో అన్నాడీఎంకే సభ్యుడు తంగమణి సాత్తనూరు డ్యాంను తెరమీదకు తెచ్చారు. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోకుండా సాత్తనూరు డ్యాంను హడావుడిగా తెరిచేయడంతోనే వందలాది గ్రామాలు, వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కారని ధ్వజమెత్తారు.

ఆహారం, నీళ్ల కోసం ప్రజలు అలమటించాల్సి వచ్చిందని మండి పడ్డారు. ఈ సమయంలో మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ ఎదురు దాడికి దిగారు. అన్నాడీఎంకే హయాంలో చడీ చప్పుడు కాకుండా చెంబరం బాక్కం రిజర్వాయర్‌ను తెరిచినట్లుగా సాత్తనూరు డ్యాంను తాము తెరవ లేదని, ఐదుసార్లు హెచ్చరికలు జారీ చేసిన అనంతరం గేట్ల ద్వారా నీటిని విడుదల చేశామన్నారు. కేకేఎస్‌ఎస్‌ ఆర్‌.. ఐదు సార్లుమశ్రీచ్చరిరకలు ఇచ్చినానంతం సాత్తనూరు లో డ్యాం నీటి విడుదల చేశారు. చెంబరంబాక్కం రిజర్వాయర్‌ అని, అయితే, సాత్తనూరు డ్యాం అన్నది మంత్రి గుర్తెరగాలని ఈసందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఎదురు ప్రశ్నలను సందించారు. పరస్పరం వాగ్వివాదంచోటు చేసుకోవడంతో అన్నాడీఎంకే సభ్యులతో మంత్రులు కేకేఎస్‌ఎస్‌ఆర్‌, ఎంసుబ్రమణియన్‌, శేఖర్‌బాబు, అన్బరసన్‌ ఎదురుదాడి చేస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చడంతో సభ లో గందరగోళం నెలకొంది. 

అదే సమయంలో ఈ వ్యవహారానికి ముగింపుపలికే విధంగా సీఎం స్టాలిన్‌ స్పందించారు. అదే సమయంలో పళణి స్వామి సైతం వ్యాఖ్యల స్వరాన్ని పెంచారు. చెంబరం బాక్కం నుంచి సెకనుకు 29 వేల గణపుటడుగుల నీటిని మాత్రమే విడుదల చేయడానికి వీలుందని, అయితే, ఇతర ప్రాంతాలలోని వందలాది చెరువులు తెగడంతో ఆ నీరు అడయార్‌లో ఉధృతంగా ప్రవహించి గతంలో చైన్నె మునకు పరిస్థితులు దారి తీశాయని పళణి స్వామి వివరణ ఇచ్చారు. ఎన్ని అడుగుల నీళ్లు, ఎంత శాతం నీళ్లు ప్రవహించాయన్నది ముఖ్యం కాదని, ఎవరి అనుమతితో గేట్లను తెరిచారో అన్నది ముఖ్యం అని ఈసందర్భంగా సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యలు చేశారు. చెంబరం బాక్కం గేట్ల ఎత్తివేతలో మానవ తప్పిదం జరిగిందా..? లేదా 250 మందికి పైగా మరణానికి నీటి విడుదల కారణం కాదా? అన్న ప్రశ్నలను సంఽధించడంతో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య సభలో పెద్ద వారే సాగింది. సభ వాగ్వాదం, అరుపులు కేకలు సాగడంతో సీనియర్‌ మంత్రి దురై మురుగన్‌ రంగంలోకి దిగి ఇక, చాలు ఈ రచ్చ అంటూ పరిస్థితి గడిలో పెట్టే ప్రయత్నం చేశారు.

వివరణ ఇవ్వాలని..

ప్రశ్నోత్తరాల అనంతరం పీఎంకే శాసన సభా పక్ష నేత జికే మణి అదానీ పవర్‌ ప్రస్తావనను తెర మీదకు తెచ్చారు. అదానీ పవర్‌తో ఒప్పందాల గురించి స్పష్టమైన వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఇందుకు సీఎం స్టాలిన్‌ స్వయంగా సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహరాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అస్సలు అదానీని తాను ఎన్నడూ కలవ లేదని, చూడనూ లేదని స్పష్టం చేశారు. సౌరశక్తి విద్యుత్‌ విషయంగా ఇప్పటికే మంత్రి స్పష్టమైన వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. ఇది వరకు ఈ వ్యవహారంపై పీఎంకే నేతలు బయట తీవ్ర ఆరోపణలు గుప్పించారని, ఇప్పుడేమో తమరు ప్రశ్నలు సంధిస్తున్నారని జీకే మణినిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అదానీని తాను చూడనూ లేదు, కలవను లేదని స్పష్టం చేస్తున్నానని, ఆయన కూడా తనను కలవ లేదని వివరణ ఇచ్చారన్నారు. అదే సమయంలో ఈ వ్యవహారంలో పార్లమెంట్‌ జాయింట్‌ కమిటీ విచారణకు పీఎంకే, బీజేపీ సిద్ధమా...? అని సవాల్‌ చేశారు. ప్రతి పక్షాలన్నీ ఉభయ సభలలో జాయింట్‌ కమిటీ కోసం పట్టుబడుతున్నాయని, ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ముందు ఇందుకు సమాధానం ఇవ్వండీ అని నిలదీశారు. అదే సమయంలో సీఎం స్టాలిన్‌ సరైన వివరణ ఇవ్వలేదంటూ పీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేసి బయటకు వచ్చేశారు. ఇదిలా ఉండగా పార్లమెంట్‌ జాయింట్‌ కమిటీ విచారణకు పీఎంకే మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాసు ఓ ప్రకటన ద్వారా పేర్కొనడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement