
తూత్తుకుడిలో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న వరద బాధితులు
తూత్తుకుడి, నైల్లె, తెన్‌కాశి అతలాకుతలం
జలదిగ్బంధంలో వందలాది గ్రామాలు
తామర భరణి ఉగ్రరూపం
సాయం అందడం లేదని జనాగ్రహం
మంత్రులు, అధికారుల పరుగులు
రెస్క్యూపై సీఎం పర్యవేక్షణ
తూత్తుకుడి, తిరునల్వేలి (నైల్లె), తెన్‌కాశి జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. నగులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు నిండుకుండగా మారడంతో ఉబరి నీటిని విడుదల చేశారు. తామర భరణి నది మహోగ్రంగా ప్రవహిస్తుండడంతో తీర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
వందలాది గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వేలాది గృహాలలోని ప్రజలు వరద నీటిలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్నారు. కొన్నిచోట్ల సాయం అందడం లేదంటూ ప్రజలలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో మంత్రులు, అధికారులు పరుగులు తీస్తున్నారు.
సాక్షి, చైన్నె: గత ఏడాది మిచాంగ్ తుపాన్ చైన్నె నగరం, శివారు ప్రాంతాలను ముంచేసిన విషయం తెలిసిందే. చైన్నె తేరుకునేలోపు ఉపరితల ఆవర్తనం రూపంలో తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి నీట మునిగాయి. ఈ ఏడాది ఈశాన్య రుతు పవనాలు వచ్చి రాగానే చైన్నైపై ప్రభావాన్ని చూపించింది. ఆ తదుపరి ఫెంగల్ తుపాన్ రూపంలో వర్షం పడ్డప్పటికీ, విల్లుపురం, కడలూరు జిల్లాలు పూర్తిగా, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాల కొంత మేరకు తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నాయి. పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి కూడా పెను నష్టం తప్పలేదు.
ఈ పరిస్థితుల్లో తీవ్ర అల్పపీడనం తీరాన్ని దాటేసినా, ఉపరితల ఆవర్తనం రూపంలో తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాలను గత రెండు రోజులుగా వర్షం ముంచెత్తుతూ వస్తోంది. శుక్రవారం కూడా వర్షాలు కొనసాగడంతో ఆ జిల్లాల ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితులలో కాలం గడుపుతున్నారు. నగరం, పట్టణం, గ్రామం అంటూ ఎటు చూసినా నీళ్లే అన్నట్లుగా పరిస్థితి మారింది. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. పాపనాశం, మణిముత్తారు, అడవి నయనార్ తదితర రిజర్వాయర్లు అన్ని నిండాయి. ఉబరి నీటి ఉధృతి గ్రామాల మీదుగా సాగుతున్నాయి.అనేక గ్రామాల మధ్య సంబంధాలు తెగాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశిలలో పదివేలకు పైగా గృహాలను వరదలు చుట్టుముట్టి ఉన్నాయి.
తామర భరణి ఉగ్రరూపం
తెన్‌కాశి జిల్లా కడయనల్లూరు సమీపంలోని చొక్కం పట్టి గ్రామంలోని అయ్యనార్ ఆలయానికి వెళ్లిన 100 మంది భక్తులు కురుప్పానది రిజర్వాయర్ గేట్ల ఎత్తివేతతో చిక్కుకున్నారు. వీరిలో 31 మందిని అతి కష్టం మీద రక్షించారు. మరో 60 మందికి పైగా ఆలయంలోనే బిక్కు బిక్కుమంటూకాలం గడుపుతున్నారు. లక్ష క్యూ సెక్కులకు పైగా నీటితో తామర భరణి నది ఉగ్రరూపం దాల్చడంతో కురుక్కుతురై మురుగన్ ఆలయం నీట మునిగింది. పాపనాశం వద్ద తామర భరణిలో కొట్టుకెళ్తున్న ఓ వృద్ధుడిని పోలీసులు రక్షించారు.
తిరుచ్చి లాల్‌గుడి శిరువయలూరుకు చెందిన శివ శక్తి అనే యువకుడు వరదలో గల్లంత్తయ్యాడు. కుట్రాలం జలపాతం వరదలలో ఆరేళ్ల వయస్సు కలిగిన ఓ మగ ఏనుగు మరణించిన స్థితిలో కొట్టుకు వచ్చింది. ఇక్కడ నీటి ఉధృతి మరింతగా పెరగడంతో దుకాణాలన్ని ఆగమేఘాలపై తొలగించారు. పనప్పారై వద్ద వాగులలో మరణించిన స్థితిలో పలు ఆవులు కొట్టుకు వచ్చాయి. అనేక చోట్ల చెట్లు, కొండ చరియలు విరిగి పడడంతో వాహన దారులకు ఇబ్బంది తప్పడం లేదు. తామర భరణి మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలతో తీర గ్రామాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, శిబిరాలకు తరలిస్తున్నారు. మంత్రులు నెహ్రూ, మూర్తి, గీతాజీవన్, అనితారాధాకృష్ణన్ తదితరులతో పాటు అధికారులు సహాయక పనుల వేగవంతం చేయించారు. కొన్ని చోట్ల సాయం అందడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలాది ఎకరాలలో అరటి పంట దెబ్బతిన్నాయి. మరెన్నో వందలాది ఎకరాలలో ఇతర పంటలను వరదలు ముంచేశాయి. ఇక తిరునల్వేలిలో 760 మంది గర్భిణులను ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో 468 మంది డయాలసిస్ రోగులను ముందుగానే చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తిరుచెందూరు సమీపంలోని కున్నకాయల్ పరిసరాలు దీవులుగా మారాయి. ఈ మూడు జిల్లాలలో అధిక ప్రభావం ఉండగా, మధ్యాహ్నం నుంచి వర్షం కన్యాకుమారి, విరుదునగర్ జిల్లాలకు సైతం విస్తరించింది. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని విశ్వానందం పెరియార్ కాలనీకి చెందిన గణేశన్ భార్య రాజేశ్వరి (32), కుమారుడు దర్శన్ (5) వర్షపు నీటితో నిండిన గొయ్యిలోపడి మరణించారు. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలో అర్ధ సంవత్సర పరీక్షలను వాయిదా వేసి, జనవరిలో నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఇక, కడలూరులో తెన్ పైన్నె నది మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తీర గ్రామాల ప్రజలలో ఆందోళన పెరిగింది. చైన్నె శివారులోని చెంబరంబాక్కం రిజర్వాయర్ నుంచి నీటి ఉధృతి పెరగడంతో శ్రీపెరందూరు – కాంచీపురం మార్గంలో స్తంభించింది. అలాగే, చైన్నె శివారులలోని పలు రిజర్వాయర్ల నుంచి ఉబరి నీటి విడుదలతో మనలి, మీంజూరు, బర్మానగర్ పరిసరాలు జలదిగ్బధంలో చిక్కాయి. మధురవాయల్ సమీపంలో కూవం నదిలో కొట్టుకు వెళుతున్న కారును, డ్రైవర్‌ను స్థానికులు అతి కష్టం మీద రక్షించారు.
సీఎం పర్యవేక్షణ..
దక్షిణ తమిళనాడులోని జిల్లాలో మూడవ రోజుగా కురుస్తన్న వర్షాలపై సీఎం స్టాలిన్ దృష్టి పెట్టారు. తీవ్ర ప్రభావం ఎదుర్కొన్న మూడు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ నుంచి సహాయ పనులను సీఎం పర్యవేక్షించారు. అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా మానిటరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జలాశయాలు, రిజర్వాయర్‌లోని నీటిమట్టం, ఉబరి నీటి విడుదల గురించి ఆరా తీశారు. ప్రజలకు సహాయకాలను విస్తృతం కావాలని, నష్టం తీవ్రత మీద దృష్టి పెట్టి, సమగ్ర వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. మంత్రులు నెహ్రూ, కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, స్పీకర్ అప్పా వు తదితరుల నేతృత్వంలో సాగుతున్న సహాయకాల వివరాలను సేకరించారు.
జిల్లాకు ఒక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించి సాయం విస్తృతం చేయించారు. అదేసమయంలో ఆదివారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బయలు దేరనుడడం, ఇది కూడా తమిళనాడు తీరం వైపుగా పయనించనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న ఆదేశాలు జారీ చేశారు. ముందుస్తు చర్యలు విస్తృతం చేసి సిద్ధం చేసి పెట్టుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు దురై మురుగన్, ఐఏఎస్ అధికారులు రాజేష్ లఖానీ, మణి వాసన్, పి. అముదా, అపూర్వ, సత్యప్రద సాహూ తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో సీఎం స్టాలిన్ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment