25వ చిత్రానికి రెడీ అవుతున్న కృష్ణ
తమిళసినిమా: వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటుడు కృష్ణ. దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారుల మధ్య నమ్మదగ్గ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన నిరంతర శ్రమజీవి. నటనపై ఎంతో ఆసక్తి కలిగిన ఈయన కథానాయకుడిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటివరకు 24 చిత్రాల్లో నటించిన కృష్ణ తాజాగా 25వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం తన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే ఆశా భావాన్ని ఈయన వ్యక్తం చేశారు. పలు ఆసక్తికరమైన అంశాలతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపొందనున్న ఈ చిత్రాన్ని మను మంత్ర క్రియేషన్స్ పతాకంపై మహేంద్రా రాజ్ సంతోష్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈయన నిర్మిస్తున్న తొలి చిత్రం కావడం గమనార్హం. కాగా ఈ చిత్రం ద్వారా బాలకృష్ణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన రెబల్ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ఏప్రిల్ నెలలో ప్రారంభించనున్నట్లు నిర్మాత ప్రేమికుల రోజు సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో నటించే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment