క్రమశిక్షణతో కూడిన విద్యను అందించారు
వేలూరు: విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందజేసేందుకు ప్రతిఒక్కరూ ప్రయత్నం చేయాలని వేలూరు ప్రైవేటు పాఠశాలల జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ బాబు అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని సన్‌బీమ్ పాఠశాలలో వార్షికోత్సవ కార్యక్రమం పాఠశాల చైర్మన్ హరిగోపాలన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథిదిగా హాజరై మాట్లాడుతూ పాఠశాల విద్యలోనే విద్యార్థులకు క్రమ శిక్షణను అలవాటు చేయాల్సిన భాద్యత పాఠశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులపై ఆదారపడి ఉందన్నారు. గతంలో తాము చదివే రోజుల్లో ప్రత్యేక తరగతులు, ట్యూషన్‌లు లేవని పాఠశాలలో తెలిపే పాఠ్యాంశాలను చదివే వారమని అయితే ప్రస్తుతం అన్ని తరగతులకు ట్యూషన్‌లు ఇస్తున్నారన్నారు. ప్రస్తుత విద్యార్థులకు ఏసీ, టీవి, కాల క్షేపం చేయడం వంటి వాటిపై అలవాటు చేయరాదన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదివే విధంగా అలవాటు చేయాలే తప్పా కఠినంగా శిక్షించి ప్రతి నిమషం చదువుపైనే దృష్టిపెట్టే విధంగా చేయరాదన్నారు. ఈ పాఠశాలను 15 మంది విద్యార్థులతో ప్రారంభించి నేడు ఇంత పెద్దగా తయారు కావడానికి శ్రమ, పట్టుదల మాత్రమే కారణమన్నారు. విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్టులు చదివేందుకు అవకాశం కల్పించాలన్నారు. విద్యార్థులు వారి జీవితాలను ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఇందుకు రోజూ యోగా చేయడం అవసరమన్నారు. పట్టుదల, క్రమ శిక్షణ చిన్న వయస్సు నుంచే ప్రతి ఒక్కరికీ అవసరమని అప్పుడే ఉన్నత శిఖరాలకు వెళ్లగలరన్నారు. అనంతరం విద్యతో పాటూ వివిధ రంగాల్లో విజయాలు సాధించిన విద్యార్థులకు చెక్కులతో పాటూ అవార్డులను అందజేశారు. అనంతరం వివిధ సబ్జెక్టుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తంగ ప్రకాశం, ప్రిన్సిపాల్ జయరాజ్ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment