●కేకలు వేస్తున్న భార్యను కాపాడకుండా పారిపోయిన భర్త
కొరుక్కుపేట: వంట వండుతుండగా సిలిండర్ పేలి మంటల్లో చిక్కుకుని కేకలు వేస్తున్న భార్యను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా భర్త ఇంటి నుంచి పారిపోయాడు . దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైన్నెలోని అరుంబాక్కం అశోక్ నగర్‌కు చెందిన గుణ(41) అదే ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తోంది. ఆదివారం రాత్రి ఇంట్లో వంట చేస్తుండగా అకస్మాత్తుగా సిలిండర్ పేలింది. గుణ చీరకు మంటలు అంటుకుని ఆమె శరీరానికి వ్యాపించాయి. దీంతో శరీరం మొత్తం కాలిపోతున్నా భార్యను కాపాడే ప్రయత్నం చేయకుండానే ఆమె భర్త ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇంతలో ఇరుగుపొరుగువారు ప్రాణాలతో పోరాడుతున్న గుణను రక్షించి 108 అంబులెన్స్‌లో కిల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో తీవ్ర చికిత్స పొందుతోంది. కిల్పాక్కం ఆసుపత్రి నుంచి ఇచ్చిన సమాచారం మేరకు అరుంబాక్కం పోలీసులు వచ్చి గుణను విచారించారు. ఆ సమయంలో.. వంట చేస్తుండగా సిలిండర్ పేలి చీరలో మంటలు చెలరేగాయి.. అయినా నా భర్త నన్ను ఎందుకు రక్షించలేదో తెలియడం లేదని చెప్పింది. అనంతరం పోలీసులు ఆ ప్రాంత ప్రజలను విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సిలిండర్ పేలి చీరకు మంటలు అంటుకున్నాయా, కుట్ర జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment