సేలంలో దారుణం
● కిరాతకుడైన కుటుంబ పెద్ద ●నలుగుర్ని నరికి పడేశాడు.. ●ఇద్దరు బిడ్డల మృతి ●భార్య, మరో కుమార్తె పరిస్థితి విషమం
సాక్షి, చైన్నె: అనుమానం పెను భూతంగా మారడంతో ఓ కుటుంబ పెద్ద కిరాతకుడయ్యాడు. కట్టుకున్న భార్యను, పుట్టిన ముగ్గురు బిడ్డలను కిరాతకంగా నరికి పడేశాడు. ఇందులో ఇద్దరు పిల్లలు మరణించారు. మిగిలిన ఇద్దరికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. తలకు తీవ్ర గాయాలతో ఆ కిరాతకుడు సైతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం ఉదయం సేలం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని గెంగవల్లి కృష్ణాపురం ప్రాంతానికి చెందిన అశోక్‌కుమార్ ఆటో డ్రైవర్. ఇతడికి భార్య తవమణి(38), కుమార్తెలు విద్యాధరణి(13), అరుల్‌కుమారి(12), అరుల్ ప్రకాష్(5) కుమారుడు ఉన్నారు. కృష్ణాపురంలో వీరికి 2 ఎకరాల వ్యవసాయ భూమి సైతం ఉంది.
అనుమానంతో..
కొంత కాలంగా మద్యం మత్తులో అప్పుడప్పుడు ఇంటికి వచ్చి అశోక్‌కుమార్ భార్య తవమణితో గొడవ పడుతూ వచ్చాడు. భార్యపై అనుమానం పెంచుకున్న అశోక్ కుమార్ రానురాను ఉన్మాదిగా మారాడు. ఈ పరిస్థితులలో బుధవారం ఉదయం రక్త గాయాలతో అశోక్‌కుమార్ పడి ఉండటంతో ఏదో గొడవ జరిగినట్టుందని ఇరుగు పొరుగు వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడి దృశ్యాలు ఆందోళనకరంగా కనిపించాయి. ఇంట్లో పిల్లలతో పాటూ తవమణి రక్తపు మడుగులో పడి ఉండటంతో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇద్దరు పిల్లలు మరణించారు. సమాచారం అందుకున్న ఎస్పీ గౌతమ్ గోయల్, డీఎస్పీ సతీష్‌కుమార్ బృందం విచారణను వేగవంతంచేసింది. తొలుత ఏదేని దోపిడీ వంటి ఘటనలు జరిగాయా..? అన్న అనుమానాలు నెలకొన్నాయి. అయితే అశోక్‌కుమార్ వద్ద జరిపిన విచారణలో అతడి కిరాతకం వెలుగులోకి వచ్చింది.
కనికరం లేకుండా..
మంగళవారం రాత్రి భార్య తవమణితో అశోక్‌కుమార్ గొడవ పడ్డాడు. అర్ధరాత్రి వేళ అశోక్‌కుమార్ ఉన్మాదిగా మారి పోయాడు. తన పిల్లలు కత్తితో అతి కిరాతకంగా నరికే ప్రయత్నం చేయగా తవమణి అడ్డుకుంది. పిల్లలు తప్పించుకెళ్లే విధంగా ప్రయత్నించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. అడ్డు వచ్చిన తవమణిని సైతం నరికేశాడు. ఈ గొడవలో అతడి తలకు గాయాలయ్యాయి. ఉదయాన్నే ఇరుగు పొరుగు వారు చూడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో పిల్లలు విద్యాధరణి, అరుల్‌ప్రకాష్ మరణించాడు. తవమణి, అరుల్‌కుమారి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సలో ఉన్నారు.వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అశోక్‌కుమార్ సైతం ఆస్పత్రిలో ఉండటంతో అతడు తప్పించుకెళ్లకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు.
సేలంలో దారుణం
Comments
Please login to add a commentAdd a comment