●మద్రాసు హైకోర్టు ఆదేశం
కొరుక్కుపేట: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.50 లక్షల వరకు మోసం చేసిన బీజేపీ నాయకుడు, ఆయన భార్య ముందస్తు బెయిల్ పిటిషన్‌లను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. వివరాలు.. చైన్నె పొలిచూర్‌లోని యంగ్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా పేరుతో క్రీడా శిక్షణా కేంద్రం పనిచేస్తోంది. ఇందులో శిక్షణ కోసం వేలూరు జిల్లాకు చెందిన లోకేష్ చేరారు. ఆ సమయంలో శిక్షణ కేంద్రం యజమాని చెంగల్‌పట్టు జిల్లా బీజేపీ క్రీడా విభాగం ఉపాధ్యక్షుడు జయరామన్ బీజేపీలో ముఖ్యమైన పదవిలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పలు దఫాలుగా రూ.50 లక్షల వరకు తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ సర్వీసులో చేరేందుకు లోకేష్ కి అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చారు. దానిని పరిశీలించగా.. నకిలీ అని తేలింది. దీనిపై తాంబరం మున్సిపల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో లోకేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో తాంబరం పోలీస్ కమిషనర్.. బీజేపీ సభ్యుడు జయరామ్, ఆయన భార్య అశ్విని జయపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో జయరామ్, ప్రియ, అశ్విని ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను జస్టిస్ సుందర్ మోహన్ విచారించారు, దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులకు చెప్పారు. దీనిని అంగీకరించిన న్యాయమూర్తి ముగ్గురి బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment