నకిలీ సర్టిఫికెట్ల తయారీ
● రాష్ట్ర వ్యాప్తంగా విక్రయం ● నలుగురి అరెస్ట్
సేలం: నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసిన కేసులో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కడలూరు జిల్లా చిదంబరం సమీపంలో కోవిలాంపూండి గ్రామంలో గత జూన్ నెల 10వ తేదీ అన్నామలై యూనివర్సిటీ సర్టిఫికెట్లు చెత్తలో కనిపించాయి. వాటిని అధికారులు పరిశీలించగా అవి నకిలీ సర్టిఫికెట్లు అని తెలిసింది. దీంతో అన్నావర్సిటీ రిజిస్ట్రార్ ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుని విచారణ చేశారు. ఈ కేసులో సంబంధం కలిగిన చిదంబరానికి చెందిన శంకర్ (37), నాగప్పన్ (50)లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద విచారణ జరిపిన పోలీసులు 500లకు పైగా నకిలీ సర్టిఫికెట్లు, పేర్లు రాయని 4వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లు, వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన ల్యాప్‌టాప్, ప్రింటర్, నకిలీ ముద్రణ స్టాంప్‌లు, నకిలీ గుర్తింపు కార్డులు, సెల్‌ఫోన్‌లు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసును సీబీసీఐడీ విభాగానికి మార్చారు. అప్పుడు ఈ ఘటనలో తిరుచ్చికి చెందిన డాక్టర్ సుబ్బయ్య పాండి (60)కు సంబంధం ఉన్నట్టు తెలిసి సీబీసీఐడీ పోలీసులు ఆయన్ను గత సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడు చిదంబరానికి చెందిన ఒస్తీ రాజా (51) అని తెలిసింది. అతను బెంగుళూరులో దాగి ఉన్నట్టు సీబీసీఐడీ అధికారులకు తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం పోలీసులు ఒస్తీ రాజాను బుధవారం అరెస్టు చేశారు. అతనికి సహకరించిన అతని సోదరుడు నెల్సన్ (43), తమిళ్‌మారన్ (42), తంగదురై (42)లను కూడా అరెస్టు చేసి వారిని కడలూరుకు తీసుకొచ్చి విచారణ చేశారు. నలుగురిని గురువారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. వీరిలో ఒస్తీ రాజా రాష్ట్ర వ్యాప్తంగా 8వేల నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయించినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment