మాకొద్దు.. హిందీ
● ఇళ్ల ముంగిట రంగోళితో నిరసన
సాక్షి, చైన్నె : మాకొద్దు హిందీ అంటూ ఇళ్ల ముంగిట రంగోళిలతో జనం నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం చైన్నె శివారులోని అయపాక్కం పరిసరాలలో ఇంటింటా ముగ్గులతో నిరసన తెలియజేశారు. ఆది నుంచి తమిళులు హిందీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బలవంతంగా హిందీ రుద్దే దిశగా కేంద్రం ఒత్తిడి పెంచడంతో డీఎంకే పాలకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. త్రిభాషా విధానం అమలు చేస్తేనే విద్యా నిధులు అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో మళ్లీ హిందీకి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతమయ్యాయి. ఓ వైపు డీఎంకే కూటమి పార్టీలు ఆందోళన బాట పట్టగా, మరో వైపు అన్నాడీఎంకే, తమిళగ వెట్రి కళగం, నామ్ తమిళర్ కట్చి వంటి పార్టీలు కేంద్రం తీరుకు వ్యతిరేకంగా స్వరాన్ని పెంచాయి. ఈ పరిస్థితులలో ప్రజలు సైతం హిందీకి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా కదులుతున్నారు. మాకొద్దు హిందీ అంటూ కేంద్రాన్ని హెచ్చరిస్తూ ఇళ్ల ముంగిట రంగోళి వేసి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చైన్నె శివారులలోని అయపాక్కం పరిసరాలలలో బుధవారం బయలు దేరిన ఈ నిరసన రంగోళి కారు చిచ్చుగా మారుతోంది. తమ ఇళ్ల ముంగిట సైతం తమిళాభిమానులు హిందీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలతో రంగోళిలు వేసే పనిలో పడ్డారు.ఈ వీడీయోలను సీఎం స్టాలిన్ తన ఎక్స్ పేజీలో అప్‌లోడ్ చేయడమే కాకుండా, హిందీకి వ్యతిరేకంగా ఓ హ్యాష్ టాగ్‌ను ప్రకటించడంతో మద్దతుగా స్వరం పెరుగుతోండడం గమనార్హం.
మాకొద్దు.. హిందీ
Comments
Please login to add a commentAdd a comment