● 25 జిల్లాల నేతల ఏకం ● సెల్వ పెరుంతొగైకు వ్యతిరేకంగా ఢ
సాక్షి, చైన్నె: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగైకు వ్యతిరేకంగా జిల్లాల అధ్యక్షులు పోరుబాట పట్టారు. 25 జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు రాష్ట్ర అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఢిల్లీకి ఫిర్యాదులను హోరెత్తించారు. వివరాలు.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా లోక్‌సభ ఎన్నికలకు ముందుగా సెల్వ పెరుంతొగై బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. తన మార్క్ రాజకీయంపై దృష్టి పెట్టిన ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతం అంటూ వినూత్న కార్యక్రమాలను విస్తృతం చేసే పనిలో పడ్డారు. గ్రామ, వార్డు కమిటీల నుంచి మండల, పట్టణ, నగర, జిల్లా కమిటీలలో మార్పునకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఆయన రాష్ట్ర పర్యటనలో నిమగ్నమయ్యారు. తరచూ కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుని అక్కడి నేతలతో సమావేశాలు, సభలు నిర్వహించడమే కాకుండా, కొత్త పదవుల భర్తీకి సంబంధించిన కసరత్తులు చేపట్టారు. ప్రస్తుతం పార్టీ నిర్వాహకులకు గుర్తింపుకార్డులు మంజూరు ప్రక్రియపై సెల్వ పెరుంతొగై దృష్టి పెట్టారు. ఈ సమయంలో ఆయనకు వ్యతిరేకంగా 25 జిల్లాల పార్టీల అధ్యక్షులు, ముఖ్య నేతలు ఏకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ పరంగా 72 జిల్లాల ఉన్నాయి. ఇందులో 25కు పైగా జిల్లాలో ఆయా గ్రూపులకు సంబంధించిన కీలకనేతల మద్దతు దారులు పదవులలో ఉన్నారు. వీరి పదవులకు ఎసరు పెట్టే విధంగా ప్రస్తుతం సెల్వ పెరుంతొగై చర్యలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు తమను కనీసం పలకరించక పోగా, తమకు సమాచారం లేకుండా సమావేశాలు నిర్వహించడాన్ని జిల్లాల అధ్యక్షులు తీవ్రంగా పరిగణించారు.
ఫిర్యాదులు..
రాష్ట్ర అధ్యక్షుడికి వ్యతిరేకంగా వేలూరు, రామ్, అంబూర్ ప్రభు, కోయంబత్తూర్ మనోహరన్, కృష్ణగిరి కరుప్పసామి, మైలాడుతురై అమృతరాజా. పేరనాం పట్టు సురేష్. అమ్మపేట్ పాండ్యన్, వేలూరు రవిచంద్రన్, రంగసామి, తీర్థరామన్, శ్రీనివాస కుమార్, దిండిగల్ మణికందన్, నమక్కల్ సిద్దిక్ తదితర జిల్లాల నేతలతో పాటుగా చైన్నెకు చెందిన పలువురు జిల్లాల నేతలు , ముఖ్య నేతలు రాష్ట్ర అధ్యక్షుడికి వ్యతిరేకంగా పోరుబాటకు సిద్ధం కావడం గమనార్హం. వీరికి కొన్ని గ్రూపులకు చెందిన కీలక నేతల మద్దతు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం అధ్యక్షుడి తీరుకు వ్యతిరేకంగా ఈ జిల్లాల అధ్యక్షుల ద్వారా అఽధిష్టానానికి ఫిర్యాదులు చేయించడం గమనార్హం. అంతేకాకుండా ఈ 25 మంది జిల్లా కాంగ్రెస్ నేతలు బుధవారం చైన్నె నుంచి ఢిల్లీ వెళ్లారు. తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షించే ముఖ్య నేతలతో వీరు సమావేశం కావడం గమనార్హం. ఈసందర్భంగా 4 పేజీలతో కూడిన ఫిర్యాదు లేఖను అందించినట్టు సమాచారం. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందజేయడానికి నిర్ణయించి ఢిల్లీలోనే తిష్ట వేసి ఉన్నారు. ఈ విషయంగా ఢిల్లీ వెళ్లిన జిల్లాల నేతలలో ఒకరైన ద్రవ్యం పేర్కొంటూ, జిల్లాల అధ్యక్షులుగా ఉన్న సీనియర్లను పక్కన పెట్టి, జూనియర్లను సమావేశాలకు అధ్యక్షుడు పిలవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తమను సంప్రదించకుండానే తమ జిల్లాల వ్యవహారాలపై జోక్యం చేసుకుంటున్నారని, రాష్ట్రంలో పార్టీని భ్రష్టు పట్టించే విధంగా అధ్యక్షుడు తీరు ఉందని, ఆయన్ను తప్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ నేతలను కలవనున్నామని పేర్కొనడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో చైన్నెలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో అంతర్గత సమరం చర్చ జోరందుకుంది. అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఒక బృందం ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అన్నట్టుగా నేతలు చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం, గత వారం పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జ్‌గా అజోయ్‌కుమార్‌ను ఏఐసీసీ తప్పించిన విషయం తెలిసిందే.
అధ్యక్షుడికి వ్యతిరేకంగా పోరు
Comments
Please login to add a commentAdd a comment