సాక్షి, చైన్నె: గేటవుట్ స్టాలిన్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తన సామాజిక మాధ్యమంలో చేసిన హ్యాష్ ట్యాగ్‌ను డీఎంకే తీవ్రంగా పరిగణించింది. ఆయనకు వ్యతిరేకంగా చట్టపరంగా చర్యలపై దృష్టి పెట్టే పనిలో డీఎంకే వర్గాలు నిమగ్నమయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు, ఆరోపణలు చేయడంలో ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మరింతగా స్వరాన్ని పెంచారు. అవినీతి ఆరోపణలు అంటూ జాబితాలను ప్రకటిస్తున్నారు. అంతే కాదు, డీఎంకే కార్యాలయాన్ని ముట్టడిస్తా, ఉదయ నిధి ఇంటిని ముట్టడిస్తా అన్న హెచ్చరికలు చేస్తున్నారు. ఈ పరిస్థితులలో శుక్రవారం ఉదయాన్నే మరో అడుగు ముందుకు వేశారు. గెటవుట్ స్టాలిన్ అంటూ హ్యాష్ ట్యాగ్‌ను తన సామాజిక మాధ్యం పేజీలో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యల వెనక మరాఠా పిల్లలు కూర్చుని చదువుకుంటున్నట్టు, వేంగై వయల్ వాటర్ ట్యాంక్‌లో మలం కలిపిన వ్యవహారం గుర్తు చేస్తూ, పౌష్టికాహారం గుడ్డులో అవినీతి, ఇసుక అక్రమ విక్రయాలు , సారా రక్కసి , ఆవిన్ పాలలో అక్రమాలు, వీధి వీధిలో మద్యం దుకాణం అంటూ అనేక ఫొటోలను ట్యాగ్ చేయడం గమనార్హం. కొన్ని గంటలలో దీనిని లక్షలాది మంది వీక్షించారు. ఇందులో 20 వేల మందికి పైగా అయితే, గెటవుట్ స్టాలిన్ అంటూ అన్నామలైకు మద్దతుగా నిలిచారు. ఈ హ్యాష్ టాగ్‌ను డీఎంకే వర్గాలు తీవ్రంగానే పరిగణించాయి. సీఎం స్టాలిన్‌కు వ్యతిరేకంగా స్పందించడమే కాకుండా, సీఎం పదవిని అవమానించే విధంగా అన్నామలై వ్యవహరించారన్న ఆగ్రహాన్ని డీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో స్టాలిన్‌కు మద్దతుగా, తమిళం వర్ధిల్లాల్లి అంటూ అన్నామలైకు వ్యతిరేకంగా ఎదురు దాడిలో నిమగ్నమయ్యారు. అన్నామలై తీరును మంత్రి శేఖర్‌బాబు తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డీఎంకేలో ఒక్క ఇటుకను కూడా పీక లేడని హెచ్చరించారు. అన్నామలైకు దమ్ముంటే అరియవాలయాన్ని తాకి చూడమనండంటూ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment