పళణికి వ్యతిరేకంగా పిటిషన్
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే చిహ్నాన్ని పళణిస్వామి వినియోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం మరో పిటిషన్ చేరింది. అన్నాడీఎంకే అంతర్గత సమరం కోర్టుకు వెళ్లడం, చివరకు బంతిని కేంద్ర ఎన్నికల కమిషన్ కోర్టులోకి న్యాయ స్థానం నెట్టిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే అంతర్గత వివాదాలపై ఎన్నికల కమిషన్ విచారించేందుకు అవకాశాన్ని కోర్టు కల్పించింది. దీంతో అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళణిస్వామిని ఇరకాటంలో పెట్టే దిశగా మాజీ సీఎం పన్నీరుసెల్వం, ఆయన మద్దతుదారులు, వ్యతిరేకులు వ్యూహాలకు పదును పెట్టారు. ఎన్నికల కమిషన్ ముందు తమ తరఫున వాదనలు వినిపించి, పళనిస్వామి చేసిన మార్పులకు చెక్‌పెట్టే దిశగా పరుగులు తీస్తున్నారు. అదే సమయంలో అంతర్గత సమరంపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టిన నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి అనే పదవిని వినియోగించకుండా, రెండాకుల చిహ్నాన్ని వాడకుండా పళణిస్వామికి చెక్‌పెట్టేందుకు వ్యతిరేకులు సిద్ధమయ్యారు. పార్టీకి సంబంధించిన సివిల్ కేసులు కోర్టుల్లో ఉండడం, అంతర్గత సమరంపై విచారణ జరుపుతుండడం వంటి అంశాలను అస్త్రంగా చేసుకుని పళణిస్వామికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తున్న సూర్యమూర్తి తాజాగా మరో పిటిషన్‌ను ఎన్నికల కమిషన్ ముందు శుక్రవారం దాఖలు చేశారు. కోర్టుల్లో కేసులు, ఎన్నికల కమిషన్ విచారణ వంటి పరిణామాల నేపథ్యంలో పళణిస్వామి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని వినియోగించకుండా, రెండాకుల చిహ్నాన్ని వాడకుండా చెక్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆ పిటిషన్ ద్వారా ఎన్నికల కమిషన్‌ను సూర్యమూర్తి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment