
4 నెలల శిశువుకు.. కాలెయమార్పిడి!
సాక్షి, చైన్నె: నాలుగు నెలల శిశువుకు పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ను వడపళని కావేరి ఆస్పత్రి వైద్యులు విజయవంతం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద ఈ సంక్లిష్ట శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్సతో పిల్లలకు కాలేయ మార్పిడిని నిర్వహించగల సామర్థ్యం ఉన్న కేంద్రాలలో ఒకటిగా ఈ ఆస్పత్రి నిలిచినట్లయ్యింది. అరుదైన జన్యుపరమైన రుగ్మత , తీవ్రమైన కామెర్లు ప్రభావం బారీన పడ్డ 3.5 కిలోల బరువున్న శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వడపళనిలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. కేసు అత్యవసరంగా ఉండటంతో, తమిళనాడు సీఎం పథకం కింద క్లియరెన్స్ సహా అవసరమైన అనుమతులను ఆసుపత్రి వర్గాలు త్వరితగతిన పూర్తి చేశారు. 10 రోజులలో కాలేయ మార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్సలకు సిద్ధమయ్యారు. తన బిడ్డకు తల్లి కాలేయం దానం చేయడానికి సిద్ధమైంది. సుమారు 110 గ్రాముల బరువున్న ఆమె కాలేయంలోని ఒక భాగాన్ని ఆమె బిడ్డకు విజయవంతంగా అమర్చారు. ఈ ప్రక్రియను వడపళనిలోని కావేరి ఆసుపత్రిలోపి లివర్ – మల్టీ–ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ స్వామినాథన్ సంబంధం కనిష్ట ఇన్వాసివ్ విధానంతో లాపరోస్కోపిక్–సహాయక దాత శస్త్రచికిత్సను ఉపయోగించి నిర్వహించారు. శస్త్రచికిత్స తర్వాత మూడు రోజులకే తల్లిని డిశ్చార్జ్ చేశారు ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్‌లు, పీడియాట్రిక్ అనస్థీషియాలజిస్టులు, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, పీడియాట్రిక్ హెపటాలజిస్టులు, రేడియాలజిస్టులు , ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులతో కూడిన ప్రత్యేక బృందం ఈ శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ప్రధానంగా 4 కిలోల బరువు , 6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులలో పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్లు తీవ్రమైన శస్త్రచికిత్స సవాళ్లతో కూడుకున్నట్టు వైద్యులు వివరించారు. శిశువులలో రక్త నాళాలు చాలా చిన్నవిగా ఉంటాయని, ధమనులు 2 మిమీ వరకు , సిరలు 3 మిమీ వరకు ఉంటాయని వివరించారు. శిశువు చిన్న పరిమాణం కారణంగా, 110 గ్రాముల కాలేయని మార్పిడి శస్త్ర చికిత్స ద్వారా అమర్చడం చాలా సంక్లిష్టంగా జరిగినట్టు పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్స త మిళనాడు ముఖ్యమంత్రి భీమా పథకం కింద విజయవంతంగా పూర్తి చేశామని ఈసందర్భంగా డాక్టర్ స్వామినాథన్ సంబంధం తెలిపారు. ఆస్పత్రి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ, సంక్లిష్టమైన విధానాలలో తమ ఆస్పత్రి ప్రత్యేక బృందం నైపుణ్యం, అధునాతన పద్ధతులను అనుసరిస్తున్నట్టు వివరించారు.