● నిఘా వలయంలో రామేశ్వరం దీవులు
సాక్షి, చైన్నె : ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వం కుస్తీలు పడుతున్నారు. మోదీ ప్రసన్నం కోసం అపాయింట్ మెంట్ ప్రయత్నాలు వేగవంతంచేశారు. పాంబన్‌లో వంతెన నిర్మాణం పూర్తయిన విషయం తెలిసిందే. దీనిని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి మదురైకు వచ్చే ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రామేశ్వరం వెళ్తారు. దీంతో రామేశ్వరాన్ని నిఘా నీడలోకి తీసుకొచ్చారు. మోదీ రాకతో రామేశ్వరం జాలర్లకు చేపల వేటకు నిషేధం విధించారు. శుక్రవారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు జాలర్లు ఎవ్వరూ కడలిలోకి వెళ్లకుండా కట్టడిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. రామేశ్వరం దీవులన్నీ పూర్తిగా కేంద్ర నిఘా వర్గాల గుప్పెట్లోకి చేరినట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. 3,500 మంది తమిళనాడు పోలీసులు శుక్రవారం నుంచే భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు.
కుస్తీలు..అన్నామలై వ్యాఖ్యల చర్చ
మదురైలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రయత్నాలు మమ్మరం చేశారు. ఇప్పటికే అపాయింట్‌మెంట్ ప్రయత్నాలు చేపట్టారు. అదే సమయంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం కూడా ప్రయత్నాలపై దృష్టి పెట్టారు. ఈ ఇద్దరు మోదీని కలిసే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. మోదీ ఈ ఇద్దర్ని మళ్లీ కలిపే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. అన్నాడీఎంకేతో 2026లో పొత్తు ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ భేటీ కీలకం కానుంది. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం చైన్నెకు మరి కొద్ది రోజుల్లో రాబోతున్నారు. ఇది పూర్తిగా రాజకీయ పర్యటన కానున్నట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. పొత్తు కావాలంటే, అన్నామలైను తప్పించాలన్న డిమాండ్ ఉంచినట్టు సమాచారం. ఇందుకు బలం చేకూరే వ్యాఖ్యలను శుక్రవారం అన్నామలై చేశారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఎవ్వర్నీ తాను సిఫారసు చేయనని, ఆ పార్టీలో మేధావులు, మంచి వారు, పుణ్యాత్ములు తమిళనాట ఉన్నారని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అన్నామలై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాయి. ఆయన్ను తప్పించి నైనార్ నాగేంద్రన్‌ను అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నాయన్న చర్చ మరింతగా ఊపందుకుంది.