నీట్‌ రద్దుకు చట్ట సమరం! | - | Sakshi
Sakshi News home page

నీట్‌ రద్దుకు చట్ట సమరం!

Published Sat, Apr 5 2025 12:17 AM | Last Updated on Sat, Apr 5 2025 12:17 AM

సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల అనంతరం సీఎం స్టాలిన్‌ ప్రత్యేక ప్రసంగం చేశారు. వైద్యరంగంలో తమిళ నాడు భారత దేశానికి మార్గదర్శకంగా ఉందన్నా రు. 2006లో వైద్యం సహా అన్ని కోర్సులకు ప్రవేశ పరీక్షలను రద్దు చేశామని, ప్లస్‌టూ మార్కుల ఆధారంగా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలను నిర్ధారించే విధంగా మార్గదర్శక ప్రవేశ పద్ధతిని కలైంజ్ఞర్‌ కరుణానిధి ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులను ఉన్నత చదువుల మేరకు వైద్యులుగా తీర్చిదిద్దామని ధీమా వ్యక్తం చేశారు. నీట్‌ పరీక్ష విధానం అమల్లోకి వచ్చిన తర్వాత శిక్షణ కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఏర్పడిందన్నారు. సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఈ పరీక్ష విధానం ఉండడంతో అందరి మధ్య ఏకాభిప్రాయం ఆధారంగా, సరైన ప్రత్యామ్నాయం కోసం రిటైర్డ్‌ న్యాయమూర్తి రాజన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కమిటీ సిఫార్సు ఆధారంగా, ఈ శాసనసభలో 2021లో నీట్‌ మినహాయింపు, రద్దుకు తీర్మానం చేశామని గుర్తు చేశారు. అయితే, దీనిని కొంత కాలం గవర్నర్‌ ఆమోదించకుండా పక్కన పెట్టారని, ఆతర్వాత పు నఃపరిశీలన పేరిట వెనక్కి పంపించారని పేర్కొన్నా రు. అసెంబ్లీ ఆమోదం పొందిన ముసాయిదాను గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. అయితే, ప్రస్తుతం దీనిని ఆయుష్‌ మంత్రిత్వ, హోం మంత్రిత్వ శాఖలు వెనక్కి పంపించడం విచారకరం అని అన్నారు. అసెంబ్లీ ఆమోదం పొందిన నీట్‌ మినహాయింపు చట్టాన్ని యూనియన్‌ ప్రభుత్వం నిరాకరించడాన్ని అసెంబ్లీకి దృష్టికి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. కేంద్రంలోని యూనియన్‌ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తంచేస్తూ, ఇంతటితో ఈ వ్యవహారం ఆగిపోదని, ఇక న్యాయ పోరాటానికి సిద్ధం అని ప్రకటించారు. ఇందు కోసం ఈనెల 9వ తేదీ సాయంత్రం సచివాలయంలో సమావేశానికి నిర్ణయించామని ప్రకటించారు. పార్టీల ప్రతినిధులు, న్యాయ నిపుణులను సంప్రదించి తమిళనాడులోని లక్షలాది మంది విద్యార్థులకు వైద్య విద్యను దరి చేర్చడం లక్ష్యంగా, వారి కలలను సాకారం చేయడమే ధ్యేయంగా దృఢ సంకల్పంతో ఈ సభ వేదికగా తాను మాటిస్తున్నానని ప్రకటించారు.

కులగణన చర్చ – ఎంపురాన్‌ గోల

అసెంబ్లీలో మంత్రి శేఖర్‌బాబు మాట్లాడుతూ తమిళనాడులో ఆధ్యాత్మిక నినాదం మార్మోగుతోందన్నారు. ఆ మేరకు ఆలయాలకు ఈ ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్టు వివరించారు. మంత్రి వేలు మాట్లాడుతూ కొడైకెనాల్‌కు మరో మార్గం ఏర్పాటు దిశగా సాధ్యా అసాధ్యాల నివేదిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. మోహన్‌లాల్‌ నటించిన ఎంపురాన్‌ చిత్రం అసెంబ్లీకి చేరింది. ఈ చిత్రంలో కేరళలో ఉన్న తమిళనాడుకు చెందిన ముల్లై పెరియార్‌ డ్యాం కూలిన పక్షంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ప్రస్తావించి ఉన్నారని తమిళర్‌ వాల్వురిమై కట్టి ఎమ్మెల్యే వేల్‌మురుగన్‌ వివరించారు. ఈ చిత్రానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. మంత్రి దురై మురుగన్‌ జోక్యం చేసుకుని తాను ఆ సినిమా చూడ లేదని, కొందరు అందులోని విషయాన్ని తన వద్ద ప్రస్తావించారని, వినగానే ఆందోళన , భయం, కోపం వచ్చిందన్నారు. ఇంతలోపు సీఎం స్టాలిన్‌ జోక్యం చేసుకుని వ్యతిరేకతను తెలియజేయగానే ఆ దృశ్యాలను తొలగించారని పేర్కొంటూ, ఆ చర్చకు ముగింపు పలికారు. అనంతరం కులగణన చర్చ సభలో రసవత్తరంగా సాగింది. అన్నాడీఎంకే, పీఎంకే సభ్యులతో న్యాయశాఖా మంత్రి రఘుపతి ఎదురుదాడి చేశారు. అన్నాడీఎంకేను ఇరకాటంలో పెట్టే విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తమరు కులగణనకు చర్యలు తీసుకోలేదో అని ప్రశ్నల వర్షాన్ని మంత్రి కురిపించారు. కులగణన కేంద్రం కోర్టులో ఉందంటూ వివరించారు. అనంతరం న్యాయశాఖకు నిధుల కేటాయింపు అంశాల ప్రకటనను సభలో ఆ శాఖ మంత్రి రఘుపతి ప్రస్తావించారు.

అన్నాడీఎంకే వాకౌట్‌

అసెంబ్లీలో సీఎం ప్రసంగం తర్వాత అన్నాడీఎంకే శాసనసభా పక్ష ఉప నేత ఉదయకుమార్‌ తెరపైకి తెచ్చిన ఓ అంశాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత పళణిస్వామి ప్రస్తావించారు. ఇందుకు స్పీకర్‌ అప్పావు అనుమతి ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై చర్చకు ఇది సమయం కాదని వారించారు. దీంతో అన్నాడీఎంకే సభ్యులందరూ లేచి నిలబడి తమ నిరసనను వ్యక్తంచేస్తూ, గళాన్ని నొక్క వద్దు అని నినదించారు. అన్నాడీఎంకే సభ్యులను స్పీకర్‌ తీవ్రంగా హెచ్చరించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో స్పీకర్‌ చర్యలకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు ప్రకటించి, అన్నాడీఎంకే సభ్యులు వెలుపలకు వచ్చేశారు. ఈసందర్భంగా మీడియాతో పళణిస్వామి మాట్లాడుతూ, యూ ట్యూబర్‌ షౌక్‌ శంకర్‌ ఇంటిపై దాడిని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు జరుగుతున్న విఘాతాన్ని గుర్తు చేస్తే, తమ గళాన్ని నొక్కేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శాసన సభా పక్ష సమావేశానికి వెళ్లాలా వద్దా అని చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement