
ప్రభుత్వ ఉద్యోగం పేరిట టోకరా!
–రూ.20 లక్షలు కాజేసిన వైనం
–ఎస్పీకి బాధితుల ఫిర్యాదు
వేలూరు: ఉద్యోగం ఇప్పిస్తామని రూ.20లక్షలు తీసుకుని మోసం చేశారని బాధితులు వేలూరు ఎస్పీకి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు..కాట్పాడి సమీపంలోని కయంజూరుకు చెందిన బాధితులు కొన్ని నెలల క్రితం వేలూరులోని ఉపాధి కల్పనా కార్యాలయానికి వెళ్లినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు తన చిన్నాన కొడుకు చైన్నె సచివాలయంలో పనిచేస్తున్నారని, డబ్బులిస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికాడు. తన కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగం కోసం 2021లో రూ.18 లక్షలు, ఆ తర్వాత 2022లో రూ.2 లక్షలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించకపోగా, నిలదీస్తే అంతుచూస్తామని బెదిరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఎస్పీని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేయాలని సంబంధిత పోలీసులను ఎస్పీ ఆదేశించారు.