
19న తిరువళ్లూరుకు సీఎం
తిరువళ్లూరు: జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్న క్రమంలో అన్ని శాఖలకు చెందిన అధికారులతో మంత్రి నాజర్ శనివారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాజర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పూర్తయిన పనుల వివరాలను సేకరించారు. ముగింపు దశలో ఉన్న నిర్మాణాలు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి, ఇప్పటికే పూర్తయిన పనులను ముఖ్యమంత్రి చేతుల మీధుగా ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెల్ట్ ఏరియాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉన్న వారికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిన క్రమంలో లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరగకుండా చూడాలని ఆదేశించారు. వివాదాలకు తావు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. దీంతో పాటు జిల్లాకు అవసరమైన నిధులపై ముఖ్యమంత్రిని కోరాలని, అందుకు అవసరమైన పూర్తి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయారిటీ, అత్యవసర పనులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, తిరుత్తణి చంద్రన్, పూందమల్లి కృష్ణస్వామి, మాధవరం కారపాక్కం గణపతి, ఎస్పీ శ్రీనివాసపెరుమాళ్, ఆవడి కార్పొరేషన్ కమిషనర్ కందస్వామి, మేయర్ ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు.