
సినీ వివాదం
● నిర్మాతల మండలి–ఫెఫ్సీకి మధ్య ముదిరిన వివాదం
తమిళసినిమా: తమిళ నిర్మాతల మండలికి దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ)కి కొంతకాలంగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అది తాజాగా మరింత తీవ్ర రూపం దాల్చింది. తమిళ నిర్మాతల మండలి కొత్తగా తమిళనాడు సినీ కార్మికుల సమాఖ్యను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ఒక ప్రకటన చేశారు. అదే విషయాన్ని శనివారం మరోసారి చైన్నెలోని ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పునరుద్ఘాటించారు. దక్షిణాది భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అందులో తాము మొదటి నుంచి అనే విషయాల్లో నిర్మాతల మండలికి శాయశక్తులా సహకరిస్తూనే ఉన్నామన్నారు. అదే సమయంలో ఫెఫ్సీ అధ్యక్షుడిగా తమ సభ్యుల శ్రేయస్సు తమకు ముఖ్యం అన్నారు. తమిళ నిర్మాతల మండలికి, యాక్టివ్ నిర్మాతల మండలికి మధ్య సమస్యలను పరిష్కరించుకోలేక తమపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. నిర్మాత క్రియేషన్‌కు నటుడు ధనుష్‌కు మధ్య సమస్యకు కూడా తమపైనే నిందలు వేస్తున్నారన్నారు. తాము యాక్టివ్ నిర్మాతల మండలికి సహకరించడం తమిళ నిర్మాతల మండలికి ఇష్టం లేదన్నారు. తమకు కార్మికుల పరిరక్షణ ముఖ్యం అన్నారు. తాము శనివారం తమిళ నిర్మాతల మండలి రాసిన లేఖలో కూడా తమ సహకారం పూర్తిగా ఉంటుందని స్పష్టం చేశామన్నారు. అయినప్పటికీ వాళ్లు తమిళ సినీ కార్మికుల సమాఖ్యను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని, అందువల్ల తమ సమాఖ్యను అణచివేయాలని భావించే తమిళ నిర్మాతల మండలితో ఇకపై కలిసి పని చేయబోమని ప్రకటించారు.