
కార్తీ లేకుండా సీక్వెల్ ఉండదు!
తమిళసినిమా: నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్. నటి రీమాసేన్, ఆండ్రియా కథానాయకిలుగా నటించిన ఇందులో పార్థిబన్ ముఖ్యపాత్రలు పోషించారు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో విడుదలై అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టింది. కాగా ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు సెల్వరాఘవన్ అప్పుడే ప్రకటించారు. అయితే అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కాగా 2021లో ధనుష్ కథానాయకుడిగా ఆయిరత్తిల్ ఒరువన్‌కు సీక్వెల్ చేస్తానని దర్శకుడు పేర్కొన్నారు. అది జరగలేదు. తాజాగా దర్శకుడు సెల్వరాఘవన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఆయిరత్తిల్ ఒరువన్‌కు సీక్వెల్ చేయాలని తనకు బలంగా ఉందన్నారు. అయితే ఆ చిత్రాన్ని చేయాలంటే పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వస్తేనే సాధ్యం అవుతుందని అన్నారు. అలా రూపొందే చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రను పోషిస్తారని అయితే కార్తీ లేకుండా ఈ చిత్రానికి రెండవ భాగం రూపొందదని పేర్కొన్నారు. ఈ ఇద్దరు హీరోలు ఏడాది పాటు ఈ చిత్రానికి కాల్‌షీట్స్ కేటాయించాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం కార్తీ, ధనుష్ ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా అనే అనుమానం ప్రేక్షకులకు కచ్చితంగా కలుగుతుంది. కాగా ప్రస్తుతం దర్శకుడు సెల్వరాఘవన్ తాను ఇంతకుముందు తెరకెక్కించిన 7జీ.రెయిన్‌బో కాలనీ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికీ 50 శాతం పూర్తి చేసుకుందని సమాచారం.

కార్తీ లేకుండా సీక్వెల్ ఉండదు!