
అవన్నీ ఎప్పటికీ జరగవు
వేలూరు: ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే భాష, ఒకే దేవుడు అనేవి ఎప్పటికీ జరగవని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గంలోని కార్పొరేషన్ ఒకటవ డివిజన్ పరిధిలోని కాంగనల్లూరు ప్రాంతంలో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన రూ.1.20 కోట్ల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ ఇక్కడి ప్రజల చిరకాల కోరిక మేరకే ప్రస్తుతం పీహెచ్‌సీని ప్రారంభిస్తున్నామన్నారు. కాట్పాడి నియోజకవర్గంలోని ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే ఎన్నికల వ్యవహారంలో తండ్రి అడుగుజాడల్లో సీఎం స్టాలిన్ నడుచుకోవడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం సరికాదన్నారు. ఒక కేంద్ర మంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవి కావని ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే దేవుడు, ఒకే ఆహారం అనేవి ఎప్పటికీ జరగవన్నారు. ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్, అములు, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ జానకి, కార్పొరేటర్ రమేష్ పాల్గొన్నారు.