
ఘనంగా అగ్నిగుండ వసంతోత్సవం
పళ్లిపట్టు: పొదటూరుపేటలో దండుమారియమ్మన్ ఆలయ అగ్నిగుండ వేడుకలు ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణతో అగ్నిగుండ ప్రవేశం చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. వేడుకల సందర్భంగా పోలీసులు బందోబస్తు చేపట్టారు.
ఘనంగా కుంభాభిషేకం
తిరువొత్తియూరు: తిరువొత్తియూరు టోల్ గేట్ వద్ద వెలిసిన దేవి దండుమారియమ్మన్ ఆలయంలో సోమవారం కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఇందులో పలువురు భక్తులు పాల్గొన్నారు. తిరువొత్తియూరు సరిహద్దు దేవతగా జలం, భూమి, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలై వెలిసిన దేవి దండు మారియిమ్మన్ ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు పనులు పూర్తి చేసి హిందూ దేవదాయ శాఖ ఆధ్వర్యంలో 35 ఏళ్ల తర్వాత అష్టబంధన మహా కుంభాభిషేకం జరిగింది. ఆదివారం 6.04.2025 న ఉదయం గణపతి పూజ, గోపూజ, యాగశాల పూజలు ప్రారంభమయ్యాయి. 2 రోజైన సోమవారం సంకటహర హోమం, నవగ్రహ హోమం, మహాలక్ష్మీ హోమం పూర్తి చేశారు. దీపారాధన తరువాత అనంతరం మంగళ వాయిద్యం, శంఖనాథం మధ్య శివాచార్యులు కలశాలను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కలశాల్లోని నీటిని ఆలయ గోపురాలపై పవిత్ర జలంతో అభిషేకం చేశారు. 35 ఏళ్ల తర్వాత జరుగుతున్న కుంభాభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఓం శక్తి, పరాశక్తి అంటూ నినాదాలు చేసి భక్తి పారవశ్యంతో స్వామివారిని దర్శించుకున్నారు.
బస్సు వసతి కల్పించాలని
విద్యార్థినుల వినతి
వేలూరు: బస్సు వసతి కల్పించాలని కోరుతూ విద్యార్థినులు పాఠశాలకు సెలవు పెట్టి యూనిఫాంతోనే కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్ సుబ్బలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సోమవారం ఉదయం వేలూరు కలెక్టరేట్‌లో ప్రజా విన్నపాల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. వినతులు అందుకున్న కలెక్టర్ వీటిపై విచారణ జరిపి వెంటనే బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కేవీకుప్పం సమీపంలోని వెల్లేరి గ్రామానికి చెందిన విద్యార్థులు అందజేసిన వినతిలో పేర్కొన్న విధంగా తమ గ్రామానికి గతంలో ప్రభుత్వ బస్సు వచ్చేదని అయితే తమ గ్రామం సమీపంలోని సెండ్రాంబల్లి గ్రామం వద్ద ఒక వ్యక్తి రోడ్డు పక్కన సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేశాడని దీంతో బస్సు వస్తే ట్యాంకు పూర్తిగా ధ్వంసమవుతుందని రాజకీయ నాయకుల చొరవతో బస్సును నిలిపి వేశారని వెంటనే గ్రామానికి బస్సు వసతి కల్పించి తమను ఆదుకోవాలని కోరారు. బస్సు లేక పోవడంతో తాము కాలి నడకన పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. వీటిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు కలెక్టర్ వద్ద కన్నీరు పెట్టుకున్నారు. దీనిపై విచారణ జరిపి వెంటనే బస్సు వసతి కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు వెనుదిరిగారు.

ఘనంగా అగ్నిగుండ వసంతోత్సవం