
తమిళుల ఆత్మ గౌరవం..
అనూహ్య రీతిలో తమిళనాట కొత్త పొత్తలు వికసించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పక్కా అవకాశవాదంతో అన్నాడీఎంకే, బీజేపీ జట్టుకట్టాయని వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని సీఎం స్టాలిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇన్నాళ్లూ బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని బీరాలు పలికిన పళణిస్వామి ప్లేటు ఫిరాయించడం ప్రజలను మోసం చేయడమే అని ధ్వజమెత్తారు.
● అన్నాడీఎంకే బానిసత్వ గుడారం అంటూ తీవ్ర వ్యాఖ్యలు ● ఓటు బ్యాంక్ కోసం కమల తహతహ ● అన్నాడీఎంకే–బీజేపీ కూటమిపై సీఎం స్టాలిన్ ఫైర్
అవకాశవాదంతో..
దాడుల భయంతో..
అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా కూడ బెట్టిన అవినీతి సొమ్మును రక్షించుకునేందుకు అన్నాడీఎంకే వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారని సీఎం స్టాలిన్ ఆరోపించారు. ఈడీ, ఐటీ అంటూ రెండు దాడులు జరగగానే, అన్నాడీఎంకేను తాకట్టు పెట్టేశారని ఎద్దేవా చేశారు. తమిళనాడును ఆక్రమించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగానే ఏఐఏడీఎంకే – బీజేపీ పొత్తు ఏర్పడిందని, వీరికి ఓటమి తప్పదని హెచ్చరించారు. వరుస పరాజయాలతో ముందుకెళ్తున్న వాళ్లు ప్రస్తుతం ఏ ప్రాతిపదికన కూటమిలో చేరారు? అని ప్రశ్నించారు. కనీస కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రకటించ లేదని పేర్కొన్నారు. నీట్, హిందీ, త్రిభాషా విధానం, వక్ఫ్‌చట్టం, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారాలలో తమిళనాడు కోసం అన్నాడీఎంకే కూటమి ఏం చేయబోతున్నదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో అన్నాడీఎంకే నాయకత్వానికి కనీసం మాట్లాడే అవకాశం కూడా కేంద్రమంత్రి అమిత్ షా ఇవ్వక పోవడం గమనించ దగ్గ విషయంగా పేర్కొన్నారు. డీఎంకేను, డీఎంకే ప్రభుత్వాన్ని, తనను విమర్శించడానికి ఈ సమావేశాన్ని ఆయన వేదికగా చేసుకున్నట్టుందన్నారు.
మాట్లాడుతున్న సీఎం ఎంకే స్టాలిన్
విమర్శల జోరు
సీఎం ఓవైపు ఘాటుగా స్పందిస్తే.. తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్ సైతం అన్నాడీఎంకే –బీజేపీ కూటమిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. వీరిది నిర్బంధ కూటమి అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే మూడు సార్లు ఈ కూటమిని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని గుర్తుచేస్తూ 2026 ఎన్నికలలో డీఎంకే, టీవీకే మధ్య మాత్రమే సమరం అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎండీఎంకే నేత వైగో పేర్కొంటూ కూటమి ప్రకటన సమయంలో పళణిస్వామి ఎందుకు నోరు మెదప లేదని ప్రశ్నించారు. బీజేపీకి ఆది నుంచి తొత్తుగానే పళణి స్వామి ఉంటూ వచ్చారని, ఇప్పుడు బహిర్గతమైందన్నారు. వీసీకే నేత తిరుమావళవన్ పేర్కొంటూ, అన్నాడీఎంకేను బెదిరించి బలవంతంగా బీజేపీ దారిలోకి తెచ్చుకున్న విషయం స్పష్టం అవుతోందన్నారు. బీజేపీతో పొత్తు అన్నది అన్నాడీఎంకే మళ్లీ తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. అన్నాడీఎంకే ఓటు బ్యాంక్‌ను తన ఖాతాలో వేసుకుని బలాన్ని చాటుకునే ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు.
సాక్షి, చైన్నె: అవకాశ వాదంతో తమిళనాడు ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టే కుట్రలో జరుగుతోందని అన్నాడీఎంకేను ఉద్దేశించి సీఎం స్టాలిన్ విరుచుకు పడ్డారు. అన్నాడీఎంకే ఓ బానిసత్వ గుడారం అని వ్యాఖ్యానిస్తూ, వీరి ఓటు బ్యాంక్‌ను కై వసం చేసుకునేందుకు బీజేపీ తహతహ లాడుతున్నట్టు విమర్శించారు. బీజేపీతో భవిష్యత్తులోనూ పొత్తుప్రసక్తే లేదంటూ వచ్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కే పళణి స్వామి శుక్రవారం చైన్నె వేదికగా కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఎన్‌డీఏ కూటమిలోకి మళ్లీ చేరిన విషయం తెలిసిందే. ఈ కూటమిపై సర్వత్రా విమర్శలు బయలుదేరాయి. సీఎం ఎంకే స్టాలిన్, టీవీకే నేత విజయ్, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, కాంగ్రెస్ నేత సెల్వ పెరుంతొగై అంటూ పలు పార్టీల నేతలు అన్నాడీఎంకేను గురి పెట్టి గురువారం విమర్శనాస్త్రాలు సంధించారు. ఇందులో సీఎం స్టాలిన్ అన్నాడీఎంకేను, అమిత్ షాను టార్గెట్ చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్ర హక్కులను, భాషా హక్కులను, తమిళ సంస్క్కతిని రక్షించేందుకు డీఎంకే అహర్నిషలు శ్రమిస్తున్నదని వివరించారు. అవకాశ వాదం, అధికార దాహంతో తమిళనాడు ఆత్మగౌరవాన్ని, తమిళనాడు హక్కులను కూటమి అంటూ ఢిల్లీకి కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నారని మండి పడ్డారు. అధికారంలో ఉన్న సమయలో తమిళనాడును కేంద్రానికి తాకట్టు పెట్టి నాశనం చేసిన విషయాన్ని ఎవ్వరూ మరిచి పోలేదన్నారు. నీట్ విషయంగా ప్రశ్నిస్తే మంత్రి సరైన సమాధానం ఇవ్వక పోగా, వ్యవహారాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తమిళనాడులో 20 మందికిపైగా విద్యార్థులు నీట్‌కు వ్యతిరేకంగా ప్రాణాల్ని తీసుకున్న విషయాన్ని మంత్రి పక్కనే ఉన్న పళణి మరిచిన ట్టున్నారని పేర్కొన్నారు. తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించాయని మంత్రి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక్కడ శాంతి వనంగా ఉండబట్టే దేశ విదేశాల నుంచి విస్తృతంగా పెట్టుబడులు తమిళనాడులోకి వస్తున్న విషయాన్ని గుర్తుచేస్తున్నానని, ప్రగతి పథంలో ఈ రాష్ట్రం దూసుకెళ్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నానని హితవు పలికారు. హోంమంత్రి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేసి ప్రజలలో భయాందోళనలు రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు. అన్నాడీఎంకేతో పొత్తును ప్రకటిస్తూ హోంశాఖ మంత్రి అవినీతి గురించి మాట్లాడటం కూడా హాస్యస్పదంగా ఉందన్నారు. అవినీతికి కేరాఫ్ అన్నాడీఎంకే అన్న విషయాన్ని మరిచినట్టున్నారంటూ అవినీతి కారణంగా రెండు సార్లు సీఎం పదవికి జయలలిత రాజీనామా చేయడం, జైలు శిక్ష విధించడం వంటి ఘటనలను గుర్తు చేశారు. బీజేపీ కుట్రలను తమిళనాడులో అమలు చేయడానికి అన్నాడీఎంకే సిద్ధమైందని, కేంద్రసంస్థల దాడుల నుంచి తప్పించుకునేందుకు బానిసత్వ గుడారమైన అన్నాడీఎంకే నాయకత్వం బీజేపీ బెదిరింపునకు లొంగి పోయిందన్నారు. ఎవరు వచ్చినా, ఎవరు ఎవరితో వచ్చినా, తమిళనాడు ప్రజలు వారికి గుణపాఠం చెప్పడం ఖాయం అని, ఈ నమ్మక ద్రోహులను తమిళనాడు ప్రజలు క్షమించబోరన్నారు.

తమిళుల ఆత్మ గౌరవం..