
పాప్‌కార్న్ ధరను ప్రభుత్వమే నిర్ణయించాలి
తమిళసినిమా: సక్సెస్ క్రియేషన్స్ పతాకంపై పౌవులోస్ జార్జ్ నిర్మించిన అగమొళి విళిగళ్, సశీంద్ర కె.శంకర్ దర్శకత్వం వహించారు. ఈయన ప్రముఖ దర్శకుడు భరతన్ శిష్యుడు అన్నది గమనార్హం. నటుడు ఆదమ్ హాసన్, నటి నేహా రత్నాకరన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్పీ వెంకటేష్ సంగీతాన్ని అందించారు. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే నెల 9వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పేరరసు కె.రాజన్, చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతల సంఘం అధ్యక్షుడు కె.అనుబంధం, తమిళనాడు ప్రభుత్వ సాహిత్య సంగీత నాటక మండలి సభ్యుడు మంగై రాజన్, జాగ్వార్ తంగం, తమిళనాడు థియేటర్ల సంఘం కార్యదర్శి తిరుచ్చి శ్రీధర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. చిత్రం నిర్మాత పౌవులోస్ జార్జ్ మాట్లాడుతూ అగమొళి విళిగళ్ చిత్రాన్ని మే నెల తొమ్మిదో తేదీన విడుదల చేస్తున్నామని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ అగమొళి చిత్రం పేరే అందంగా ఉందన్నారు తమిళ భాష తెలియని ఈ చిత్రం నిర్మాత పేపర్‌పై రాసుకొని మరీ సమావేశంలో మాట్లాడడం ప్రశంసనీయమన్నారు. ఈ చిత్రంలోని పాటలు, విజువల్స్ అన్నీ బాగున్నాయన్నారు. తమిళ సినిమా నశించి పోతుందని అంటున్నారని, ఈ విషయంలో ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా సినిమా థియేటర్లో టికెట్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం పాప్‌కార్న్ ధరలను నిర్ణయించలేదా అంటూ ప్రశ్నించారు. థియేటర్లో రూ.30 పాప్‌కార్న్ రూ.300కు విక్రయిస్తున్నారని, అదేవిధంగా సినిమా టిక్కెట్ ధర కంటే కార్ పార్కింగ్ రుసుమే అధికమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే అంటే ఎలా వస్తారని ప్రశ్నించారు. వీటి ధరలను ప్రభుత్వం ఎందుకు నిర్ణయించకూడదు, ప్రజల కోసమే కదా ప్రభుత్వం అని అన్నారు. అగమొళి విళిగళ్ చిత్రాన్ని చిన్న బడ్జెట్లో అద్భుతంగా రూపొందించారన్నారు. విజువల్స్ చూస్తుంటే పెయింటింగ్ మాదిరి ఉన్నాయన్నారు. అంతగా చిత్రం యూనిట్ శ్రమించిందని, ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు దర్శకుడు పేరరసు పేర్కొన్నారు.

పాప్‌కార్న్ ధరను ప్రభుత్వమే నిర్ణయించాలి