
పుదుచ్చేరిలో బీజేపీ నేత హత్య
● నడి రోడ్డుపై నరికి చంపిన ముఠా ● పరిస్థితి ఉద్రిక్తం ● పోలీసుల మోహరింపు
సేలం: పుదుచ్చేరిలో బీజేపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఉమా శంకర్ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. లాటరీ వ్యాపారవేత్త మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా ఉమా శంకర్‌ను దుండగులు నరికి చంపారు. వివరాలు... పాండిచ్చేరి సమీపంలోని కరువాడికుప్పం ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉమాశంకర్(40). ఆయన పుదుచ్చేరి రాష్ట్ర బీజేపీ యువజన విభాగానికి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తున్నారు. ప్రముఖ లాటరీ వ్యాపారి మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ పుట్టినరోజు సందర్భంగా శనివారం కరువాడికుప్పం చిత్తానంద ఆలయం సమీపంలో ఏర్పాట్లు చేపట్టారు. ఈ పరిస్థితిలో, కరువాడికుప్పం ప్రాంతంలో సన్నాహాలను పరిశీలించడానికి వెళుతున్న ఉమాశంకర్‌ను అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తుల ముఠా అడ్డగించి, అతన్ని కత్తులతో నరికి చంపింది. రక్తపు మడుగులో కుప్పకూలిన ఉమాశంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న లాస్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉమాశంకర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని బంధువులు అక్కడ నిరసనలో పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దాదాపు రెండు గంటలపాటు నిరసన కొనసాగింది. డీఐజీ సత్య సుందరం అక్కడికి వచ్చి చర్చలు జరిపారు. ఆ తరువాత ఆదివారం ఉదయం మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం కటరాగమ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. హత్యకు గురైన ఉమాశంకర్‌పై పుదుచ్చేరి పోలీస్ స్టేషన్లలో వివిధ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అతనికి చాలా మంది శత్రువులు ఉన్నారని, అందుకే కేసు నమోదు చేసి అతన్ని ఎవరు చంపారో దర్యాప్తు చేస్తున్నామని లాస్‌పేట పోలీసులు తెలిపారు.