
ప్రాణం తీసిన అనుమానం
● భార్యను కత్తితో పొడి చంపి... ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య
సేలం: ధర్మపురి టౌన్, మదికొండపాళయంకు చెందిన రమేష్ కుమార్(32) భార్య మహాలక్ష్మి (28). వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 2019లో జరిగిన హత్య కేసులో రమేష్‌కుమార్‌కు ధర్మపురి కోర్టు జీవిత ఖైదు విధించింది. అతడిని పోలీసులు సేలం సెంట్రల్ జైలుకు తరలించారు. భార్య, బిడ్డలను చూడడానికి రమేష్ కుమార్ పెరోల్‌పై వచ్చాడు. గత రెండు రోజులుగా భార్యాబిడ్డలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ధర్మపురి సమీపంలోని గుండలప్పట్టిలో ఉన్న లాడ్జిలో గది తీసుకుని రమేష్ కుమార్, మహాలక్ష్మి మాత్రం బస చేశారు. ఈ స్థితిలో సోమవారం ఉదయం లాడ్జికి ఆందోళనతో వచ్చిన రమేష్‌కుమార్ తల్లిదండ్రులు కిటికీ ద్వారా గదిలో చూడగా రమేష్‌కుమార్ ఉరిపై వేలాడుతూ, మంచంపై మహాలక్ష్మి మృతదేహంగా కనిపించారు. సమాచారం అందుకున్న మదికొండపాళయం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రమేష్‌కుమార్ మృతదేహంగా వేలాడుతుండగా, మహాలక్ష్మి గుండెల్లో కత్తితో పొడిచిన స్థితిలో మృతి చెంది పడి ఉంది. భార్య మహాలక్ష్మి ప్రవర్తనపై అనుమానంతో ఆమెను కత్తితో పొడి హత్య చేసి, తర్వాత రమేష్‌కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అతని తండ్రి చక్రవర్తి పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.