
పవిత్రోత్సవం.. పరిసమాప్తం
ఇరుగు–పొరుగు
పవిత్ర విసర్జన నిర్వహిస్తున్న పండితులు
స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్న అర్చకులు
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలో టీటీడీ అనుబంధ శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలు శుక్రవారం పవిత్ర విసర్జనతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారు జామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, అర్చన చేశారు. అనంతరం ఆలయ పండిత బృందం యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకించారు. సాయంత్రం ఉభయ దేవేరులతో స్వామి వారిని పట్టు పీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి తిరుచ్చిపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాల నడుమ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అడుగడుగునా నారికేళ కర్పూర నీరాజనాలు సమర్పించారు. పవిత్రోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాలను డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ పర్యవేక్షించారు.

పవిత్రోత్సవం.. పరిసమాప్తం